గోషా మహల్ నియోజకవర్గంలో ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డు…
- హైదరాబాదులో ఘటన
- చక్నావాడి ప్రాంతంలో కుంగిన రోడ్డు
- పెద్ద గొయ్యి ఏర్పడిన వైనం
- గుంతలో పడిపోయిన కార్లు, ఆటోలు, కూరగాయల దుకాణాలు
హైదరాబాదులోని గోషామహల్ నియోజకవర్గంలో ఓ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. చక్నావాడిలో పట్టపగలు ఓ నాలాపై ఉన్న రోడ్డు కుంగిపోయింది. దాని వల్ల పెద్ద గుంత ఏర్పడగా, అందులో పలు కార్లు, ఆటోలు పడిపోయాయి.
ఆ ప్రాంతంలో సంత జరుగుతుండగా, పలు కూరగాయల దుకాణాలు కూడా ఆ గోతిలో పడిపోయాయి. ఈ ఘటనతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేసి సహాయకచర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
రోడ్డు కుంగిపోవడానికి గల కారణాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. నగరంలో పురాతనమైన నాలాలు ఉన్నాయని, ఇష్టానుసారం ఆక్రమణలకు పాల్పడడం కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయని వివరించారు. ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడతామని తెలిపారు.