హెడ్ కానిస్టేబుల్‌తో గొడవ.. తుపాకితో కాల్చి చంపిన కానిస్టేబుల్!
- చత్తీస్‌గఢ్‌లోని కాంకర్ జిల్లాలో ఘటన
- హెడ్ కానిస్టేబుల్‌ను కాల్చి చంపాక గదిలోకి వెళ్లి లాక్ చేసుకున్న నిందితుడు
- బయటకు రప్పించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
హెడ్ కానిస్టేబుల్‌తో జరిగిన గొడవతో ఆగ్రహానికి లోనైన కానిస్టేబుల్ అతడిని తుపాకితో కాల్చి చంపాడు. చత్తీస్‌గఢ్‌లోని కాంకర్ జిల్లాలో జరిగిందీ ఘటన. భానుప్రతాప్‌పూర్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల ఉప ఎన్నిక జరిగింది. కాంకర్‌లోని ప్రభుత్వ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈవీఎంలను అక్కడ భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్‌రూమ్ వద్ద చత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ (సీఏఎఫ్) 11వ బెటాలియన్‌ను మోహరించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కానిస్టేబుల్ పురుషోత్తమ్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర భగత్ మధ్య ఏదో విషయంలో గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పురుషోత్తమ్ సింగ్ వెంటనే తన ఇన్సాస్ రైఫిల్‌తో హెడ్ కానిస్టేబుల్ తలలో కాల్చాడు. తల నుంచి తూటాలు దూసుకెళ్లడంతో భగత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భయపడిన పురుషోత్తమ్ ఓ గదిలోకి వెళ్లి తనను తాను బంధించుకున్నాడు. విషయం తెలిసిన సీనియర్ అధికారులు అతడిని ఒప్పించి బయటకు రప్పించారు. అతడు బయటకు వచ్చాక అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరి మధ్య గొడవకు గల కారణం తెలియరాలేదు. డిసెంబరు 5న భానుప్రతాప్‌పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. డిసెంబరు 8న ఓట్లను లెక్కించారు. అనంతరం మరో 45 రోజులపాటు ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌రూముకు తరలించారు. అక్కడ దానికి కాపలాగా ఉన్న కానిస్టేబుళ్ల మధ్య గొడవ జరిగి అది కాల్పులకు దారితీసింది. కాగా, గతేడాది నవంబరు 8న సుక్మా జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. సహచర జవాను జరిపిన కాల్పుల్లో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్‌కు చెందిన నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.