సంచలనం సృష్టిస్తున్న యనమల సోదరుడి ఫోన్ కాల్!
- తుని నియోజవకర్గంలో అన్నదమ్ముల పోరు!
- యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్యకు టికెట్ అంటూ ప్రచారం!
- తొండంగి టీడీపీ నేతతో యనమల కృష్ణుడి ఫోన్ కాల్
- నియోజకవర్గంలో కష్టపడింది నేను అంటూ వ్యాఖ్యలు
కాకినాడ జిల్లాలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడికి మధ్య తుని సీటు విషయంలో చిచ్చు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుని సీటును టీడీపీ అధినాయకత్వం యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్యకు ఇస్తోందన్న వార్తల నేపథ్యంలో…. యనమల కృష్ణుడు తొండంగి టీడీపీ నేతతో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఓ ఫోన్ కాల్ సంచలనం సృష్టిస్తోంది. యనమల కృష్ణుడు ప్రస్తుతం తుని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు.
ఇంతకీ ఆ ఫోన్ కాల్ సారాంశం ఏమిటంటే…
“ప్రతి ఊరి నుంచి 40 మంది యనమల రామకృష్ణుడికి వద్దకు వెళ్లండి. నియోజకవర్గంలో యనమల కృష్ణుడు కష్టపడితే సీటు దివ్యకు ఇస్తారా? అని అడగండి. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ గల్లంతవుతుందని చెప్పండి. దివ్య ఇంట్లోనే ఉండే మనిషి… ఈసారి టికెట్ యనమల కృష్ణుడికి ఇవ్వక్కర్లేదు, అలాగే దివ్యకు కూడా ఇవ్వొద్దని యనమల రామకృష్ణుడికి చెప్పండి. తునిలో ఈసారి కూడా మంత్రి దాడిశెట్టి రాజానే గెలుస్తాడని అందరూ అనుకుంటున్నారు. తుని నియోజకవర్గంలో యాదవుల ఓట్లు 30 వేల వరకు ఉన్నాయి. నేను లేకపోతే కష్టమే!” అని పేర్కొన్నారు. ఇప్పడీ ఫోన్ కాల్ టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.