మృతి చెందిన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి నివాళులు అర్పించిన చంద్రబాబు!
- నిన్న కందుకూరులో చంద్రబాబు సభ
- భారీగా తొక్కిసలాట.. 8 మంది మృతి
- దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు
- మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ
- పార్టీ తరఫున ఆర్థికసాయం అందజేత
కందుకూరు సభలో మరణించిన కార్యకర్తలకు చంద్రబాబు నివాళులు అర్పించారు. మృతిచెందిన కార్యకర్తల నివాసాలకు వెళ్లిన చంద్రబాబు నివాళులు అర్పించి, ఆర్థికసాయం తాలూకు చెక్కులు అందించారు. మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఊటుకూరి పురుషోత్తం, కాకుమాని రాజా, కలవకూరి యానాదిల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు… శోకసంద్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను చూసి చలించిపోయారు. వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. నిన్న కందుకూరు సభకు భారీగా పార్టీ శ్రేణులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. చంద్రబాబు అంతకుముందే కార్యకర్తలను పలుమార్లు హెచ్చరించినప్పటికీ, పరిస్థితి అదుపుతప్పింది.
అన్ని పార్టీలు సభలు జరిపే చోటే మేమూ సభ ఏర్పాటు చేశాం: చంద్రబాబు
కందుకూరు సభలో తొక్కిసలాట కారణంగా 8 మంది మృతి చెందిన విషాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున, నేతల తరఫున మొత్తమ్మీద రూ.25 లక్షల వరకు సాయం అందించే ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
కాగా, కందుకూరు సభలో తొక్కిలాటపై తమపై వస్తున్న విమర్శలకు చంద్రబాబు ఈ సందర్భంగా బదులిచ్చారు. ఇరుకు రోడ్లలో సభలు జరపాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఇన్నేళ్లలో ఎన్నో సభలు పెట్టామని, అన్ని పార్టీలు సభలు జరిపే చోటే తాము కూడా సభ ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని విషయాలను తమపై విమర్శలు చేసిన వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నానని తెలిపారు.