విదేశీయులు ఇళ్లు కొనకుండా కెనడాలో నిషేధం!
- జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన నిర్ణయం
- శాశ్వత నివాస హోదా కలిగిన వారు, శరణార్థులకు మినహాయింపు
- పెరిగిపోయిన ఇళ్ల ధరలను దించే ప్రయత్నం
కెనడాలో విదేశీయులు ఇళ్లు కొనకుండా విధించిన నిషేధం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. స్థానికులకు ఇళ్ల కొరత సమస్య ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మరిన్ని ఇళ్లు వారికి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. శాశ్వత నివాసం కలిగిన వారు, శరణార్థులకు దీని నుంచి మినహాయింపు నిచ్చారు.
రెండేళ్ల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. డిమాండ్ కు సరిపడా ఇళ్ల లభ్యత లేకపోవడంతో ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో 2021 ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఇచ్చిన హామీ మేరకు తాజా నిషేధాన్ని అమల్లో పెట్టారు.
కెనడా సెంట్రల్ బ్యాంకు రేట్లను గణనీయంగా పెంచడంతో రుణాలపై ఇళ్లు కొన్న వారు భారంగా భావించి విక్రయాలకు మొగ్గు చూపిస్తుండడంతో.. 2022 ఆరంభం నుంచి చూస్తే సగటున ఒక్కో ఇంటి ధర రూ.8 కోట్ల నుంచి రూ.5.9 కోట్లకు తగ్గింది. జనాభాలో కేవలం 5 శాతంగా ఉన్న విదేశీయులు కొనుగోలు చేయకుండా అడ్డుకోవడం వల్ల ఇళ్ల లభ్యత పెద్దగా పెరగబోదని, దీనికి బదులు మరిన్ని ఇళ్లను నిర్మించడం పరిష్కారమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.