షర్మిల 25 వేల సహాయం…ఒక్క పాలేరులోనేనా ?రాష్ట్రమంతనా ??
-వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ వైఖరి ఏమిటి ?
-తాను పోటీచేస్తానని ప్రకటించిన నియోజకవర్గంపైనే కేంద్రీకరణ
-ఇది తప్పుడు సంకేతాలకు దారితీస్తుందనే అభిప్రాయాలు
-పార్టీ కార్యకర్తల్లోనూ చర్చ
-పాలేరు వైపు అందరు చూపు …హాట్ గా మారనున్న పాలేరు
-ప్రవీణ్ కుమార్ , కె ఏ పాల్ కూడా పాలేరులో పోటీచేస్తారని ప్రచారం
ఇప్పటికే ఖమ్మంనికి ముఖద్వారంగా ఉన్న పాలేరు నియోజకవర్గం రాజకీయనాయకుల ఎత్తులు పైఎత్తులతో వేడెక్కుతుంది. ఇక్కడ రాజకీయ ఉద్దండులైన తాజా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తోపాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లాంటివారు బరిలో దిగబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తానని ప్రకటించడంతో పాలేరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
షర్మిల పాలేరు ప్రజలకు సహాయం చేసేందుకు సిద్ధపడ్డారు. అందుకు ఆమెను కచ్చితంగా అభినందించాల్సిదే .అయితే అది ఒక్క పాలేరులోనే సహాయం చేస్తారా ? రాష్ట్రమంతటా అమలు చేస్తారా ? అనేది ఆసక్తిగా మారింది. ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నందున పాలేరు విధానాన్నే రాష్ట్రమంతా అమలు చేసే అవకాశం లేకపోలేదు . ఒకవేళ పాలేరు విధానం అమలు చేయకపోతే మిగతా చోట్ల ఆ పార్టీకి ప్రతికూలత ఏర్పడుతుంది.
పాలేరు లో చనిపోయిన ప్రతికుటంబానికి 25 వేల రూపాయలు పంపిణి చేస్తున్నారు . వైద్యానికి 2 లక్షల వరకు షర్మిల సహాయం అందిస్తారని అంటున్నారు .పుట్టిన బిడ్డకు కూడా 25 వేల రూపాయలు ఇస్తారని తెలుస్తుంది. ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రజలకు ఆమె సహాయం చేయాలనీ నిర్ణయించుకోవడం మంచిదే . కానీ చేసే రాష్ట్రమంతటా చేయాలనే డిమాండ్ వస్తుంది. ఒక్కపాలేరులోనే అయితే అది ఆమె పోటీచేయబోతున్నారు కాబట్టి ఇస్తున్నారని అపవాదు మూటగట్టుకుంటారు . పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా రాష్ట్రమంతటా ఇస్తే ఆమెకు మరింత మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. షర్మిల లాగా మిగతా పార్టీలు చేయాలనే వత్తిడి మిగతా పార్టీలపై పెరుగుతుంది.
పాలేరు లో పోటీచేయబోతున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు . ఆమె ఒంటరిగా పోటీచేస్తారా ? లేక ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అనే చర్చ జరుగుతుంది. ఆమె బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నారని అందువల్ల బీజేపీ ఆమెకు మద్దతు ఇస్తుందని సమాచారం . పాలేరు లో పోటీచేస్తానని చెప్పిన షర్మిల అందుకు అనుగుణంగా పాలేరు నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయం నిర్మాణానికి సిద్ధమైయ్యారు . అందుకు కరుణగిరి వద్ద సుమారు ఎకరం స్థలంలో ఇటీవల భూమి పూజ చేశారు.
మరికొద్ది నెలల్లో ఎన్నికల జరగనున్నందున నియోజకవర్గంలో ఒక వ్యక్తిగత సహాయకుణ్ణి నియమించుకున్నారు . ఆయన ద్వారా నియోజకవర్గంలో చనిపోయినవారి కుటుంబాలకు 25 వేల రుపాయాలు పంపిణి చేసే కార్యక్రమాన్ని చేపట్టారు . ఇప్పటికే కొంతమందికి డబ్బు సహాయం చేశారు . పుట్టిన బిడ్డకు 25 వేలు, జబ్బుచేసినవారికి 2 లక్షల వరకు ఆరోగ్య సహాయం అందిస్తారని ప్రచారం జరుగుతుంది. అంతే కాకుండా ప్రతి మండలంలో సొంత ఆంబులెన్స్ లు ఏర్పాటు చేసి వారిని హాస్పిటల్స్ కు చేర్చే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు . ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడం మంచిదే . ఆమె రాష్ట్రపార్టీ అధ్యక్షురాలుగా వైయస్సార్ సంక్షేమ రాజ్యం తెస్తానని అంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెబుతున్నారు . మరి ఒక్క పాలేరులో మాత్రమే సహాయం చేస్తే మిగతా నియోజకవర్గాలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే చర్చ ఆమె పార్టీ నేతల్లోనే జరుగుతుంది. దీనిపై పార్టీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాల్సి ఉంది …
పాలేరు బీఆర్ యస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చనిపోయిన వ్యక్తి కుటంబానికి 10 వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు .గత 4 సంవత్సరాలుగా వేలాదిమందికి ఆయన సొంత నిధులతో కోట్లాది రూపాయలు సహాయం అందించారు . నియోజవర్గానికి ఎమ్మెల్యే గా అక్కడి ప్రజలకు సహాయం అందించడం బహుశా రాష్ట్రంలోనే మొదటి ఎమ్మెల్యేగా నిలిచారు . ఇవే కాకుండా గుడులకు , మసీదులకు , చర్చ్ లకు కూడా వచ్చినవారిని కాదనకుండా సహాయం అందించడం ఆయన చేస్తున్నారు . ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందునుంచి సహాయం అందించి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు . పేద పిల్లలకు చదవు చెప్పించడం అనాథలను ఆదుకోవడం , నిరుద్యోగులకు కాంపిటేషన్ ఎగ్జామ్స్ కోసం శిక్షణ ఇప్పించడం లాంటి కార్యక్రమాలు చేశారు . అందుకే పాలేరు నియోజకవర్గం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ నుంచే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ , ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ పోటీచేస్తారని అంటున్నారు. అదే జరిగితే నిజంగా పాలేరు దేశం దృష్టిని ఆకర్షించడం ఖాయం …ఎన్నికల నాటికీ ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో మరి …!