బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు కేరళ సీఎం పినరయి విజయన్
-సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతం
-చరిత్రలో నిలిచిపోనున్న కంటి వెలుగు …
-రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం కాలరాస్తోంది
-కీలక నిర్ణయాల్లో కేంద్రం రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు.
-రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ చేపడుతున్న అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు.
ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోందన్నారు. సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. కంటి వెలుగు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా నిలుస్తోందని.. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్ నడుం బిగించారని పినరయి విజయన్ అన్నారు. ఇదే సందర్భంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘ కేసీఆర్ చేపట్టిన పోరాటాలకు మా మద్దతు ఉంటుంది. ఇవాళ కేంద్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది.దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కేంద్రం వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది. బీజేపీ హయాంలో దేశంలో రాజ్యాంగం సంక్షోభంలో పడింది. రాష్ట్రాల సమ్మేళనమే దేశం. ఫెడరల్ స్ఫూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదు. రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం కాలరాస్తోంది. కీలక నిర్ణయాల్లో కేంద్రం రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. దేశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి పాలిస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారు. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు యత్నిస్తున్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. చర్చలు జరగకుండానే చట్టసభల్లో బిల్లులను బలవంతంగా పాస్ చేస్తున్నారు. సంస్కరణల పేరుతో కేంద్రం నైతిక విధానాలను ఆచరిస్తోంది. దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తున్నారు. మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. న్యాయ వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మోడీ కార్పొరేట్లకు తొత్తుగా మారారు. మోడీ పాలనలో ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటోంది. రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు’ అని పినరయి విజయన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.