ఇంకా కొనసాగుతున్న ఖలిస్థాన్ మంటలు…
-ఆలయ గోడలపై విద్వేష రాతలు.. ఆస్ట్రేలియాలో రెచ్చిపోతున్న ఖలిస్థానీ మద్దతుదారులు
-ఉగ్రవాదిని అమరవీరుడిగా కీర్తిస్తూ నినాదాలు
-రెండు వారాల వ్యవధిలో మూడు ఆలయాలపై ఇదేరకం దాడి
-ఆలయాలపై దాడులను ఖండించిన భారత విదేశాంగ శాఖ
ప్రపంచ వ్యాపితంగా ఖలిస్థాన్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఉగ్రవాదుల చేతిలో మన దేశప్రధాని ఇందిరా గాంధీ బలైయ్యారు . ఖలిస్థాన్ ప్రత్యేక దేశం కావాలని సిక్కు ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపారు . చివరకు సిక్కులు పవిత్రంగా భావించే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లో చొరబడ్డ ఉగ్రవాదులపై ఆపరేషన్ బ్లుస్టార్ పేరుతో ఆర్మీ ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టింది . దీంతో దీనికి కారణం ప్రధాని ఇందిరా గాంధీనేనని కక్ష పెంచుకున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఆమెను ఢిల్లీలోని తన అధికారిక నివాసంలోనే ఉదయంపూట మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా బులెట్ల వర్ష కురిపించి మట్టుబెట్టారు . తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఖలిస్థాన్ ఉద్యమం సర్దుమణిగింది . అయితే వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఖలిస్థాన్ అనుకూలురు తమ వాణిని వినిపిస్తూనే ఉన్నారు . కెనడాలో కూడా ఖలిస్థాన్ అనుకూల నినాదాలు వినిపిస్తుంటాయి. ఆస్ట్రేలియా లో హిందూ దేవాలయాల గోడలపై విద్వేషపూరిత రాతలు రాయడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
ఆస్ట్రేలియాలో ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. హిందూ ఆలయాలపై దాడి చేస్తున్నారు. గోడలపై విద్వేష రాతలతో కలకలం సృష్టిస్తున్నారు. భారత ప్రధాని మోదీకి, హిందువులకు వ్యతిరేకంగా నినాదాలు రాస్తున్నారు. రెండు వారాల వ్యవధిలో మూడు ఆలయాలపై ఇలా దాడి జరిగింది. తాజాగా, మెల్ బోర్న్ లోని అల్బర్ట్ పార్క్ దగ్గర్లో ఉన్న గుడి గోడలపైన సోమవారం ఈ విద్వేష రాతలు దర్శనమిచ్చాయి. హిందుస్థాన్ ముర్దాబాద్, ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ దుండగులు గోడలపైన పెయింట్ తో రాశారు. మోదీకి వ్యతిరేకంగా స్లోగన్లు కూడా రాశారు.
ఉగ్రవాది బింద్రన్ వాలేను అమరవీరుడిగా కీర్తిస్తూ ఆలయ గోడలపై రాసిన ఘటనల్లో ఇది మూడవది.. గతంలో శ్రీ శివ విష్ణు ఆలయ గోడలపైన, స్వామినారాయణ్ గుడి గోడలపైనా ఇలాంటి నినాదాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటనలపై ఆస్ట్రేలియాలోని హిందువులలో ఆందోళన వ్యక్తమవుతోంది. మన దేశంలోని ఆస్ట్రేలియా రాయబారి స్పందిస్తూ.. ఆస్ట్రేలియా భిన్న సంస్కృతులకు ఆలవాలమైన దేశమని, ఇలాంటి సంఘటనలకు దేశంలో చోటులేదని అన్నారు.
భావ ప్రకటన స్వేచ్ఛకు తాము ఎంతో ప్రాధాన్యమిస్తామని, అయితే, ఇలాంటి విద్వేష రాతలను ఎంతమాత్రమూ సహించబోమని ఆస్ట్రేలియా రాయబారి స్పష్టం చేశారు. కాగా, హిందూ ఆలయాలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి ఓ ప్రకటన విడుదల చేశారు.