Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓ పార్టీలో గెలిచి.. ఇంకో పార్టీలో చేరితే ఉరి శిక్ష వేయాలి: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఓ పార్టీలో గెలిచి.. ఇంకో పార్టీలో చేరితే ఉరి శిక్ష వేయాలి: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • హత్యలు, అత్యాచారాలకు అమలు చేసే శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలని రేవంత్ డిమాండ్
  • ఈ అంశంపై రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన విషయాన్ని మేధావులు ఆలోచించాలని వ్యాఖ్య
  • తెలంగాణ గవర్నర్, సీఎం మధ్య విభేదాలు ఉంటే మరో వేదిక చూసుకోవాలని మండిపాటు

పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దు చేయడంతో పాటు అవసరమైతే ఉరి తీసే విధానాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తీసుకురావాలని రేవంత్ డిమాండ్ చేశారు. ‘‘హత్యలు, అత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలి. ఫిరాయింపులపై కఠిన నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశంపై రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన విషయాన్ని మేధావులు ఆలోచించాలి’’ అని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. 

రిపబ్లిక్‌ డే వేడుకలను ప్రగతి భవన్‌కు, రాజ్‌భవన్‌కు పరిమితం చేయడం ద్వారా రాజ్యాంగాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అవమానించారని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. గవర్నర్, సీఎం మధ్య విభేదాలు ఉంటే మరో వేదికపై ప్రదర్శించాలని.. ఇద్దరి మధ్య విభేదాలకు గణతంత్ర దినోత్సవాన్ని వేదికగా మార్చుకోవడం మంచిది కాదని హితవు పలికారు. కేసీఆర్ వ్యవహార శైలిని మార్చుకోవాలని రేవంత్ సూచించారు. గవర్నర్‌ కు క్షమాపణ చెప్పాలన్నారు. కోర్టు జోక్యం చేసుకుని రిపబ్లిక్‌ డే వేడుకలు జరపాలని ఆదేశించే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 

ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతుందని రేవంత్ తెలిపారు. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు తిరుగుతామని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

టీపీసీసీ చీఫ్ పదవి రావడానికి సుదర్శన్ రెడ్డి కీలకం: రేవంత్ రెడ్డి!

Drukpadam

పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ సహాయంపై విమర్శలు!

Drukpadam

చీమలపాడు ఘటన రాజకీయపార్టీలకు గుణపాఠం కావాలి …!

Drukpadam

Leave a Comment