Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అక్కినేనిపై వ్యాఖ్యల పట్ల తొలిసారిగా స్పందించిన బాలకృష్ణ!

అక్కినేనిపై వ్యాఖ్యల పట్ల తొలిసారిగా స్పందించిన బాలకృష్ణ!
-ఎన్టీవోడు …నాగిగాడు అని అభిమానులు అంటారు ..నేను అంతే
-ఇటీవల వీరసింహారెడ్డి చిత్రం విజయోత్సవ సభ
-అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యానించిన బాలకృష్ణ
-బాలయ్యపై అక్కినేని అభిమానుల తీవ్ర విమర్శలు
-అక్కినేని బాబాయ్ అంటే అభిమానమన్న బాలయ్య
-ఫ్లోలో వచ్చిన మాటలపై రాద్ధాంతం చేస్తున్నారని విచారం

 

ఇటీవల వీరసింహారెడ్డి చిత్రం విజయోత్సవ సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పట్ల నందమూరి బాలకృష్ణ తొలిసారిగా స్పందించారు. ఆ రంగారావు ఈ రంగారావు… ఆ అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ కుటుంబంతో తమ అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, తాను ఏదో ఫ్లోలో అన్న మాటలకు రాద్ధాంతం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అక్కినేని నాగేశ్వరరావును తాను బాబాయ్ గా భావిస్తానని వెల్లడించారు.

ఆయన తన పిల్లల కంటే నన్ను ఎక్కువగా ప్రేమగా చూసుకునేవారు… నన్ను చాలా ఇష్టంగా చూసుకునేవారు… ఎందుకంటే అక్కడ ఆప్యాయత లేదు… ఇక్కడ ఉంది అని బాలయ్య వెల్లడించారు. బాబాయ్ పట్ల నా గుండెల్లో ప్రేమ ఉంది… బయట ఏవో అంటుంటారు… అవన్నీ నేను పట్టించుకోను అని స్పష్టం చేశారు.

“ఎన్టీఆర్, ఏఎన్నార్ లను అభిమానంతో ఎలా పిలుస్తారో తెలిసిందే కదా… రామారావును అభిమానంతో ఎన్టీవోడు అంటారు. ఏఎన్నార్ ను నాగిగాడు అంటారా లేదా…! అభిమానంతోనే అలా అంటారు. నేను ప్రచారానికి వెళ్లినప్పుడు నాకు కూడా ఇలాంటి మాటలు ఎదురవుతుంటాయి. వాళ్ల యాసలో ఏదో ఒక పదం జోడించి…. వెళ్లిపోతున్నాడ్రా అని అంటారు. అది వాళ్ల అభిమానం! మనకు ఆప్తులైన వాళ్ల గురించి మనం కూడా అభిమానంతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. ఒక్కోసారి మనం తాడో పేడో అని అంటుంటాం… అందులో పేడు అంటే అర్థం ఏంటి? ఏవో మాటలు కొన్నిసార్లు అలా వచ్చేస్తాయి. వాటిని తప్పుపడితే ఎలా? ప్రేమకొద్దీ అన్న మాటలను కూడా దుష్ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు” అని బాలకృష్ణ వివరించారు.

లోకేశ్ పాదయాత్ర … ప్రభుత్వం భయపడుతోందనన్న బాలకృష్ణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రేపు (జనవరి 27) కుప్పంలో పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.

లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తుండడంతో ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. అందుకే లోకేశ్ పాదయాత్రకు ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నారని తెలిపారు. తన అల్లుడు లోకేశ్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే యువగళం చేపడుతున్నాడని బాలకృష్ణ స్పష్టం చేశారు. రేపటి పాదయాత్రలో లోకేశ్ తో పాటు తాను కూడా పాల్గొంటున్నట్టు వెల్లడించారు. మధ్యలో అప్పుడప్పుడు వెళ్లి లోకేశ్ ను కలుస్తుంటానని వివరించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు పాలన అవసరమని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఒక అంబేద్కర్, ఒక చంద్రబాబు కావాలని పిలుపునిచ్చారు.

ఇవాళ హిందూపురంలోని సరస్వతి విద్యామందిర్ లో వసంత పంచమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. అటు, అంబికా లక్ష్మీనారాయణ కుమార్తె వివాహానికి బాలయ్య కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ పెళ్లికి నందమూరి తారకరత్న కూడా వచ్చారు.

Related posts

కరోనా సంక్షోభంపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 47 మంది తెలుగు వైద్యుల లేఖ

Drukpadam

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ శ్రీనివాసరావు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి!

Drukpadam

మహారాష్ట్రలో బస్సులో చెలరేగిన మంటలు.. 25 మంది సజీవ దహనం

Drukpadam

Leave a Comment