తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల!
- ఇటీవల కుప్పంలో గుండెపోటుకు గురైన తారకరత్న
- ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స
- పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్న ఆసుపత్రి వర్గాలు
- ఎక్మో సపోర్ట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని వెల్లడి
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది.
తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు. కాగా, తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో ప్రచారం జరుగుతోందని, అందులో నిజంలేదని బులెటిన్ లో స్పష్టం చేశారు. తారకరత్నకు ఇప్పటివరకు ఎక్మో సపోర్ట్ అందించనేలేదని వివరించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అభిమానులకు సమాచారం అందిస్తున్నారని, తారకరత్న ఆరోగ్యంలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే తప్పకుండా పంచుకుంటామని నారాయణ హృదయాలయ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. ప్రజలెవరూ తారకరత్నను చూసేందుకు రావొద్దని, చికిత్సకు అంతరాయం కలగకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
నందమూరి తారకరత్న ఇటీవల కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆయనకు కుప్పంలోని ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.