పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధు అరెస్ట్
కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పుట్టా మధు
భీమవరంలో అరెస్ట్ చేసిన పోలీసులు
ఈటలతో మధుకు సన్నిహిత సంబంధాలు
పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్టా మధును పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని ఉండటంతో ఆయన ఎక్కుడున్నారనే విషయం సస్పెన్స్ గా మారింది. రాష్ట్రాల సరిహద్దులు దాటారని , మహారాష్ట్రలో లోని నాగపూర్ ప్రాంతంలో ఉండవచ్చునని ప్రచారం జరిగింది. ఆయన ఆచూకీ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఎట్టకేలకు ఆయన దొరికారు. ఎక్కడ అంటే మన పక్క రాష్ట్రంలోనే దొరకటం విశేషం . ఆయనను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరం నుంచి ఆయనను హైదరాబాదుకు తరలిస్తున్నారు. మరోవైపు, ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. దాదాపు మూడు నెలల క్రితం మంథని వద్ద జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల హత్య కేసులో మధు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
మరోవైపు ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ తో పుట్టా మధుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈటలతో కలిసి ఆయన వ్యాపార లావాదేవీలను కూడా నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈటలతో సంబంధాల నేపథ్యంలో మధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు.