పార్టీ మారాలనుకుంటే మారండి… ఇలాంటి ఆరోపణలు వద్దు: కోటంరెడ్డికి మంత్రి అమర్నాథ్ సూచన!
- తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న కోటంరెడ్డి
- ఈ ఉదయం ఆధారాలతో ప్రెస్ మీట్
- ఫోన్ ట్యాపింగ్ వేరు, ఫోన్ రికార్డింగ్ వేరన్న అమర్నాథ్
- థర్డ్ పార్టీ రికార్డు చేస్తే ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అన్న మంత్రి
కొన్నాళ్లుగా తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ చెబుతున్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయడం తనకిష్టం లేదని అన్నారు. మనసు ఒక చోట, శరీరం మరో చోట కష్టమైన పని అని అభిప్రాయపడ్డారు.
దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఫోన్ ట్యాపింగ్ వేరు, ఫోన్ రికార్డింగ్ వేరని స్పష్టం చేశారు. మధ్యలో ఎవరో మూడో వ్యక్తి రికార్డ్ చేస్తే దాంతో ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. కోటంరెడ్డి పార్టీ మారాలనుకుంటే మారొచ్చు కానీ ఇలాంటి ఆరోపణలు సరికాదని అన్నారు.