Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కాకినాడ ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఏడుగురి మృతి!

కాకినాడ ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఏడుగురి మృతి!

  • ట్యాంక్ శుభ్రంచేసే క్రమంలో ఊపిరాడక చనిపోయిన కార్మికులు
  • మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులుగా గుర్తించిన అధికారులు
  • జి.రాగంపేటలో కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీలో ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంక్ లోకి దిగిన ఏడుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. ట్యాంక్ ను శుభ్రం చేసే క్రమంలో ఒకరి వెనక మరొకరుగా లోపలికి దిగారు. లోపల ఊపిరాడకపోవడంతో అందరూ చనిపోయారు. పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని అంబటి సుబ్బయ్య ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ దారుణం జరిగింది.

జి.రాగంపేటలో ఆయిల్ ఫ్యాక్టరీని కొత్తగా కడుతున్నారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆయిల్ ట్యాంక్ ను శుభ్రం చేసేందుకు ఇద్దరు కార్మికులు లోపలికి దిగారు. లోపల ఊపిరి ఆడకపోవడంతో ఇద్దరూ స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీసుకురావడానికి మరో ఇద్దరు కార్మికులు లోపలికి దిగగా.. వారు కూడా స్పృహ కోల్పోయారు. ఇలా ఏడుగురు కార్మికులు ట్యాంక్ లోపలకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంక్ లో నుంచి మృతదేహాలను వెలికితీయించారు. చనిపోయిన కార్మికులలో ఐదుగురు పాడేరు వాసులేనని అధికారులు తెలిపారు. అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారని భావిస్తున్నారు. మిగతా ఇద్దరు కార్మికులను పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన కార్మికులలో ఒకరి భార్య నిండు గర్భిణీ అని తోటి కార్మికులు తెలిపారు.

Related posts

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూపిటిషన్…విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు

Drukpadam

భర్త ఇంటి ఎదుట నెలన్నర రోజులుగా దీక్ష.. చివరికి ఆత్మహత్య

Drukpadam

ఏపీలో తపాలా ఓట్లపై కలకలం రేపుతున్న హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment