సిపిఐ …కాంగ్రెస్ కలయిక కాకతాళీయమా ? కావాలనా…??
నేడు అశ్వాపురంలో రేవంత్ పాదయాత్రలో కలిసి నడిసిన సిపిఐ నేతలు
అవాక్కయిన బీఆర్ యస్ శ్రేణులు
కాకతాళీయమే అంటున్న సిపిఐ శ్రేణులు
రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో ఎన్నికల జరగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఆదిశగా పావులు కదుపుతున్నాయి.గతంలో బీఆర్ యస్ కు లెఫ్ట్ పార్టీలకు సత్సంబంధాలు లేవు …వారితో కలిసి వెళ్ళలేదు . అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల సహాయం సీఎం కేసీఆర్ అర్థించారు . దానికి అంగీకరించిన వామపక్షాలు, బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేశాయి. అప్పటినుంచి ఒక అంగీకారానికి వచ్చిన లెఫ్ట్ , బీఆర్ యస్ లు బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి.
అయితే రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు . ఈసందర్భంగాఅశ్వాపురం మండల కేంద్రంలో రైతుల సమస్యలపై ఆందోళన చేస్తున్న సిపిఐ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని కలవడం ఆయన వారి ఆందోళనకు మద్దతు పలకడం జరిగింది. అందరు జైజైలు కొట్టారు . సిపిఐ నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు . ఇది సిపిఐ కావాలని చేసిందా …? కాకతాళీయంగా జరిగిందా అంటే సిపిఐ నేతలు మాత్రం కాకతాళీయమే అంటున్నారు . కాంగ్రెస్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు . అటుగా వస్తున్నా రేవంత్ రెడ్డి యాత్రను చూసిన సిపిఐ కార్యకర్తలు వారిని చూసి ఆగిన మాట నిజమేనని రేవంత్ రెడ్డి తమకు సంఘీభావం తెలిపారని అంటున్నారు . ఎవరి వాదనలో ఎంతవరకు నిజమున్న లెఫ్ట్ పార్టీలలోని క్షేత్ర స్థాయి కార్యకర్తల్లో బీఆర్ యస్ తో కలవడంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తుంది .సిపిఐ నేతలు రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ యస్ శ్రేణులు సైతం అవాక్కు అయ్యాయి. దీనిపై సిపిఐ ఎలాంటి వివరణ ఇస్తుందోననే ఆసక్తి నెలకొన్నది .
ఇప్పటికే బీజేపీ తో యుద్ధం చేస్తున్న గులాబీ పార్టీకి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. మునుగోడు ఎన్నికల్లో లెఫ్ట్ సపోర్ట్ లేకపోతె గులాబీ పార్టీ ఓడిపోయేదనేది వాస్తవం …ఇది గులాబీ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు … లెఫ్ట్ వల్ల గెలిచిన గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారితో కలిసి నడవాలని దేశ స్థాయిలో కూడా బీజేపీ వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టుల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇటీవల ఖమ్మం లో జరిగిన బీఆర్ యస్ సభకు సైతం కేరళ ,ఢిల్లీ ,పంజాబ్ సీఎంలను యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానించారు . నాందేడ్ సభకు లెఫ్ట్ తో సహా ఎవరిని ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది .
లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్ తో కుస్తీనా …దోస్తీనా అనేదానిపై పార్టీలో నిజంగా కన్ఫ్యూజన్ ఉందా ? అనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనిపై కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. ఒక పక్క త్రిపుర లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టిన లెఫ్ట్ , కేరళలో యుద్ధం చేస్తుందని ప్రధాని నరేంద్రమోడీ సైతం ఎద్దేవా చేశారు . దీనిపై లెఫ్ట్ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి మరి ….!