చైనా బెలూన్ల కలకలం.. దేనికైనా రెడీ అంటూ బ్రిటన్ ప్రధాని రిషి సంచలన ప్రకటన!
- చైనా నిఘా బెలూన్లు తమనూ టార్గెట్ చేయచ్చంటూ బ్రిటన్‌లో ఆందోళన
- దేశ రక్షణ కోసం ఏం చేసేందుకైనా సిద్ధమన్న ప్రధాని రిషి సునాక్
- గగనతలంలో అనుమానాస్పద వస్తువులను తక్షణం కూల్చేస్తామంటూ ప్రకటన
లండన్ః అమెరికాలో కలకలం రేపుతున్న చైనా నిఘా బెలూన్లు బ్రిటన్‌ను కూడా టార్గెట్ చేయచ్చన్న వార్తల నడుమ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌ను సురక్షితంగా ఉంచేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. అమెరికా గగనతలంలో నాలుగో అనుమానాస్పద వస్తువును కూల్చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చిన కొద్ది గంటలకే రిషి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘‘ప్రజలకు చెబుతున్నదేంటంటే.. బ్రిటన్‌ను సురక్షితంగా ఉంచేందుకు ఏం చేసేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం’’ అని రిషి సునాక్ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు.
అమెరికా ఇప్పటివరకూ తన గగనతలంలో అనుమానాస్పదంగా ఉన్న నాలుగు వస్తువులను కూల్చేసింది. అయితే.. మొదట కూల్చేసిన బెలూన్ అత్యాధునికమైన నిఘా బెలూన్ అని, దాన్ని చైనాయే ప్రయోగించిందని ప్రకటించింది. భారత్‌తో సహా పలు దేశాలపై నిఘా పెట్టేందుకు చైనా పలు బెలూన్లు సిద్ధం చేసిందన్న కథనం ఒకటి ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఇక బ్రిటన్ గగనతలంలో అనుమానాస్పద వస్తువులను యుద్ధ విమానాలతో కూల్చేందుకు తాము సిద్ధమేనని ప్రధాని రిషి సునాక్ తెలిపారు. ‘‘అత్యవసర సమాయాల్లో వేగంగా స్పందించేందుకు క్విక్ యాక్షన్ రెన్సాన్స్ ఫోర్స్ సిద్ధం చేశాం’’ అని ఆయన చెప్పారు.
అవి గ్రహాంతర వాసుల వాహనాలు కాదు.. అనుమానాస్పద వాహనాల కూల్చివేతపై అమెరికా క్లారిటీ
తమ గగనతలంపై ఇటీవల అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను అమెరికా కూల్చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇవి గ్రహాంతర వాసుల వాహనాలంటూ అమెరికాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని కొట్టిపారేయలేం అని నార్త్ అమెరికన్ ఎయిరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (నోరాడ్) హెడ్ గ్లెన్ డి వాన్ హెరిక్ చెప్పడంతో మరింత గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరినె జీన్ పీరే స్పష్టతనిచ్చారు. సోమవారం మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు. అమెరికా సైన్యం కూల్చేసిన వాహనాలు గ్రహాంతర వాసులవేనంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని తేల్చేశారు. ఏలియన్స్ ఉనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఆమె వివరించారు.
ఫిబ్రవరి 4న చైనాకు చెందిన స్పై బెలూన్ ను కూల్చేశాక వారం వ్యవధిలోనే మూడు అనుమానిత వస్తువులను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేశాయని పీరే తెలిపారు. సదరు వాహనాల శకలాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నామని ఆమె వివరించారు. ఇప్పటి వరకు ఆ మూడింటిలో ఒక్కదానికి సంబంధించిన శకలాలు కూడా సేకరించలేదని చెప్పారు. ఆ శకలాలను పరీక్షించిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు.