మాజీ మంత్రి జి.కుతూహలమ్మ కన్నుమూత!
- తిరుపతిలోని నివాసంలో తుదిశ్వాస విడిచిన కుతూహలమ్మ
- కుతూహలమ్మ వయసు 74 సంవత్సరాలు
- గత కొంతకాలంగా అనారోగ్యం
- ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా నెగ్గిన కుతూహలమ్మ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. తిరుపతిలోని ఆమె నివాసంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కుతూహలమ్మ 1949 జూన్ 1న ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించారు. వృత్తిరీత్యా ఆమె డాక్టర్. ఎంబీబీఎస్ చేసిన కుతూహలమ్మ కొంతకాలం వైద్య వృత్తిని చేపట్టారు. రాజకీయాలపై ఆసక్తితో 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. వేపంజేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. వేపంజేరి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు.
1991లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. 1992-93లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు డిప్యూటీ స్పీకర్ గానూ వ్యవహరించారు.
ఆమె 1985 నుంచి వరుసగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే, 2009లో వేపంజేరి నియోజకవర్గం రద్దు కాగా, ఎస్సీ రిజర్వుడు స్థానం గంగాధర నెల్లూరు నుంచి కుతూహలమ్మ పోటీ చేయాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు.
అంతకుముందు ఆమె రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2021లో ఆమె కుమారుడితో కలిసి టీడీపీకి రాజీనామా చేశారు.