Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కన్ఫర్మ్ టికెట్ కోసం రైల్వే శాఖ కొత్త పథకం!

కన్ఫర్మ్ టికెట్ కోసం రైల్వే శాఖ కొత్త పథకం!

  • వెయిటింగ్ లిస్టు వెతలకు పరిష్కారం
  • టికెట్ కన్ఫర్మ్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు
  • ఐఆర్ సీటీసీ వికల్ప్ స్కీం తీసుకువస్తున్న రైల్వే శాఖ

రైలు ప్రయాణాలు చేసేవారికి వెయిటింగ్ లిస్టు గురించి తెలిసే ఉంటుంది. టికెట్ కన్ఫర్మ్ కానివాళ్లను వెయిటింగ్ లిస్టులో చేర్చుతారు. అప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయినవారిలో ఎవరైనా ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటే… వరుస క్రమాన్ని అనుసరించి ఆ సీటును వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి కేటాయిస్తారు. ఇలాంటివి ఎప్పుడో తప్ప ప్రతిసారి జరగకపోవచ్చు. అందుకే వెయిటింగ్ లిస్టులో పేరుంటే దాదాపు ఆశలు వదులుకోవాల్సిందేనని భావిస్తుంటారు.

అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు భారతీయ రైల్వే శాఖ కొత్త పథకం తీసుకువచ్చింది. దీనిపేరు ఐఆర్ సీటీసీ వికల్ప్ స్కీం. ఐఆర్ సీటీసీ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకునేవారికి ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. ఇకపై వెయిటింగ్ లిస్ట్ అని నిరాశ చెందాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ చెబుతోంది.

దీని వివరాల్లోకి వెళితే… టికెట్ బుక్ చేసుకునే సమయంలో వికల్ప్ స్కీం ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఒకవేళ వెయిటింగ్ లిస్టులో పేరుంటే, ఆ రూట్లో వెళ్లే ఇతర రైళ్లలో ఏవైనా ఖాళీలు ఉంటే సదరు ప్రయాణికుడికి ఆ రైళ్లలో ఏదైనా ఒకదాంట్లో టికెట్ కన్ఫర్మ్ చేస్తారు.

ఈ స్కీంలో మరో ఫీచర్ కూడా ఉంది. టికెట్ బుకింగ్ సమయంలో ఆటోమేటిక్ అప్ గ్రేడ్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్లీపర్ క్లాస్ లో టికెట్ బుక్ చేసుకున్నా కన్ఫర్మ్ కాకపోతే… థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీల్లో ఏవైనా ఖాళీలు ఉంటే ఆటోమేటిగ్గా ఈ టికెట్ అప్ గ్రేడ్ అయిపోతుంది. సదరు ప్రయాణికుడికి టికెట్ కన్ఫర్మ్ కావడమే కాదు, రైలులో అన్ని క్లాసుల్లో ఆక్యుపెన్సీ పెరిగేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.

ఇందులో కొన్ని చిన్న సమస్యలు లేకపోలేదు. ఒక్కోసారి మనం టికెట్ బుక్ చేసుకున్న రైలు కాకుండా మరో రైలులో వెళ్లాల్సి ఉంటుంది. మనం ఎక్కే స్టేషన్, దిగే స్టేషన్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.

రైలుకు సంబంధించి ఫుల్ రిజర్వేషన్ చార్ట్ రూపొందించిన తర్వాత ప్రకటించే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారికి మాత్రమే ఈ వికల్ప్ స్కీం వర్తిస్తుంది. అందుకే చార్టింగ్ తర్వాత పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవడం తప్పనిసరి.

అత్యంత కచ్చితంగా బెర్త్ కన్ఫర్మ్ అవుతుందన్న గ్యారంటీ లేదు. క్యాన్సిలేషన్ చార్జీలు కూడా టికెట్ కన్ఫర్మ్ అయిన రైలును బట్టి మారిపోతుంటాయి. అయితే, ఇప్పటిదాకా ఉన్న వెయిటింగ్ లిస్ట్ విధానంతో పోల్చితే ఐఆర్ సీటీసీ వికల్ప్ స్కీంతో టికెట్ కన్ఫర్మేషన్ కు గణనీయంగా అవకాశాలు ఉంటాయి.

Related posts

రాజీవ్ హత్య కేసు దోషుల విడుదలపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కాంగ్రెస్ పార్టీ!

Drukpadam

చిరుతను మట్టు బెట్టిన సహసవీరుడు

Drukpadam

A $1495 Flamingo Dress: The Pink Bird Is Dominating Fashion

Drukpadam

Leave a Comment