మహిళను చంపి వెళ్లి.. వెనక్కి వచ్చి మరో ఇద్దర్ని చంపాడు.. అమెరికాలో ఉన్మాది ఘాతుకం!
- అమెరికాలోని ఓర్లాండోలో ఓ మహిళను హత్య చేసిన యువకుడు!
- దీన్ని రిపోర్ట్ చేసేందుకు ఘటనాస్థలికి వచ్చిన ‘స్పెక్ట్రమ్ న్యూస్ 13’ ప్రతినిధులు
- వీరిపై కాల్పులకు దిగిన 19 ఏళ్ల కెయిత్ మెల్విన్ మోసెస్.. రిపోర్టర్ మృతి
- తర్వాత ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు.. చనిపోయిన 9 ఏళ్ల చిన్నారి
అమెరికాలో మరోసారి తూటాలు పేలాయి. ఓ మహిళను చంపిన యువకుడు.. కొన్ని గంటల తర్వాత వెనక్కి వచ్చి మరికొందరిపై కాల్పులు జరిపాడు. మొత్తం ముగ్గురిని బలితీసుకున్నాడు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండోలో బుధవారం (అక్కడి కాలమానం ప్రకారం) జరిగిందీ ఘటన. 19 ఏళ్ల కెయిత్ మెల్విన్ మోసెస్ ను కస్టడీలోకి తీసుకున్నామని, కాల్పుల ఘటనకు ఇతడే బాధ్యుడని భావిస్తున్నామని ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ (అధికారి) జాన్ మినా చెప్పారు.
‘‘సెంట్రల్ ఫ్లోరిడాలోని ఓర్లాండోలో పైన్ హిల్స్ ప్రాంతంలో దాడి జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో 20 ఏళ్ల యువతిని హత్య చేశారు. దీన్ని రిపోర్ట్ చేసేందుకు ఘటనాస్థలికి ‘స్పెక్ట్రమ్ న్యూస్ 13’ చానల్ ప్రతినిధులు మధ్యాహ్నం వచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో అక్కడికి వచ్చిన కెయిత్ మెల్విన్ మోసెస్.. దాడికి దిగాడు. వాహనం దగ్గర నిలబడి ఉన్న కెమెరా ఆపరేటర్, రిపోర్టర్ పై కాల్పులు జరిపాడు. రిపోర్టర్ చనిపోగా, కెమెరా ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డారు’’ అని మినా తెలిపారు.
తర్వాత దగ్గర్లోని ఓ ఇంట్లోకి చొరబడిన మోసెస్.. ఓ మహిళ, 9 నెలల బాలికపైనా కాల్పులు జరిపాడని వివరించారు. ఆసుపత్రికి తరలించగా.. బాలిక చనిపోయిందని వెల్లడించారు. రెండు ఘటనలకు కారణమని భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అతడికి నేర చరిత్ర ఉందని అన్నారు. అయితే మహిళను ఎందుకు చంపాడు? మళ్లీ వచ్చి మీడియా సిబ్బంది, ఇతరులపై ఎందుకు కాల్పులు జరిపాడు? అనేది తెలియాల్సి ఉంది. బాధితుల పేర్లను కూడా ఇంకా వెల్లడించలేదు.