మోదీకి అచ్చే దిన్ పూర్తయ్యాయి: శత్రుఘ్న సిన్హా..
- ‘ప్రధాని అభ్యర్థి’ ఎవరనే ఆలోచనతో ప్రతిపక్షాలు ఉండడం అర్థరహితమన్న శత్రుఘ్న సిన్హా
- మళ్లీ ప్రధాని కాకుండా ఎవరిని ఆపాలనే విషయంపై స్పష్టత ఉండాలని సూచన
- వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ గేమ్ చేంజర్ అవుతారని వ్యాఖ్య
ప్రతిపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి అంశంపై సినీ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై చర్చించడం అర్థరహితమని.. ‘మళ్లీ ప్రధాని కాకుండా ఎవరిని ఆపాలి’ అనే విషయంపై స్పష్టత ఉండాలని అన్నారు. తన ఫ్రెండ్ ప్రధాని మోదీకి మంచి రోజులు (అచ్చే దిన్) ముగిసిపోయాయని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
బీజేపీ నుంచి బయటికి వచ్చిన శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం టీఎంసీలో ఉన్నారు.‘వన్ మ్యాన్ షో.. టూ మ్యాన్ ఆర్మీ’లా బీజేపీ మారిందంటూ గతంలో విమర్శలు చేశారు. తాజాగా పలు అంశాలపై ఆయన స్పందించారు. టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ‘ప్రయత్నించిన’, ‘పరీక్షలు ఎదుర్కొన్న’ నేత అని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతారని అన్నారు.
‘‘ప్రతిపక్షాల నాయకుడు ఎవరనే చర్చ చాలా కాలంగా వింటూనే ఉన్నాం. నెహ్రూ ఉన్నప్పుడూ ఇదే ప్రశ్న అడిగేవాళ్లు. ప్రతిపక్షాలు ఈ ఆలోచనతో తలమునకలై ఉండడం అర్థరహితం. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రధానిగా తిరిగి రాకుండా ఎవరిని ఆపాలనే దానిపై క్లారిటీ ఉండాలి’’ అని శత్రుఘ్న సిన్హా చెప్పారు.
రాహుల్ గాంధీ సమర్థుడైన నాయకుడేనని చెప్పారు. ప్రతిపక్ష ఐక్యత కోసం ప్రయత్నించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. అయితే ప్రధానమంత్రి పదవి రేసులో తాను లేనని ఆయన చెప్పారని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు.. తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని ప్రశ్నించారు.