ప్రీతిని వేధిస్తున్నారని తెలిసినా హెచ్ఓడీ పట్టించుకోలేదు: ఈటల రాజేందర్!
- వరంగల్ వైద్య కళాశాలలో ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి
- హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స
- ప్రిన్సిపాల్, పోలీసులు పట్టించుకోలేదన్న ఈటల
- మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ కొనసాగుతూనే ఉందని వెల్లడి
వైద్య విద్యార్థిని ప్రీతి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్య కళాశాలలో సీనియర్ల వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నం చేయడం తెలిసిందే. ఇప్పుడామె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో స్పందించారు.
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ కొనసాగుతూనే ఉందని అన్నారు. ప్రీతిని సీనియర్లు వేధిస్తున్నారని హెచ్ఓడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్, పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని ఈటల విచారం వ్యక్తం చేశారు.
24, 36 గంటల డ్యూటీలతో పీజీ వైద్య విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాగా, ఎక్మో వ్యవస్థల సాయంతో చికిత్స అందిస్తున్నా ప్రీతి శరీరం సహకరించడంలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రీతికి వైద్యులు ఈఈజీ టెస్టు చేయనున్నారు. మెదడు పనిచేస్తోందా లేదా అనేది ఈఈజీ టెస్టు ద్వారా స్పష్టమవుతుంది.
ఈ రాత్రిలోగా ఈఈజీ రిపోర్టు వచ్చే అవకాశముంది. దీన్ని బట్టి ప్రీతికి ఎక్మోపై చికిత్స కొనసాగించాలా, లేక మరణించినట్టు ప్రకటించాలా అనే దానిపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.