దేశవ్యాప్తంగా మెడికోల ఆత్మహత్యలపై జాతీయ వైద్య మండలి నివేదిక!
- తెలంగాణలో ప్రీతి వ్యవహారం విషాదాంతం
- వేధింపుల కారణంగా ప్రీతి ఆత్మహత్యాయత్నం
- చికిత్స పొందుతూ మృతి
- అదే సమయంలో నివేదిక విడుదల చేసిన ఎన్ఎంసీ
- గత ఐదేళ్లలో 119 మంది మెడికోల ఆత్మహత్య
తెలంగాణలో ప్రీతి అనే మెడికో ఆత్మహత్య యత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాంతో వైద్య కళాశాలల్లో వేధింపుల సమస్యలు చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా మెడికోల ఆత్మహత్యలు, వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నివేదిక విడుదల చేసింది.
గడచిన ఐదేళ్లలో 119 మంది మెడికోలు బలవన్మరణం చెందారని ఎన్ఎంసీ వెల్లడించింది. వారిలో ఎంబీబీఎస్ యూజీ గ్రాడ్యుయేట్లు 64 మంది, వైద్య విద్య పీజీ విద్యార్థులు 55 మంది ఉన్నట్టు వివరించింది. 60 శాతం మంది ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడ్డారని వెల్లడించింది.
ముఖ్యంగా, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కు సంబంధించిన ఒత్తిడి కూడా వైద్య విద్యార్థులపై ఉంటుందని ఎన్ఎంసీ పేర్కొంది. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారు ఈ పరీక్ష పాసైతేనే భారత్ లో వైద్య వృత్తి చేపట్టేందుకు అర్హత ఉంటుందని స్పష్టం చేసింది.
ఇక, వివిధ కోర్సులకు సంబంధించిన 1,166 మంది విద్యార్థులు వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని… వేధింపులు, ఒత్తిళ్లు వైద్య విద్యార్థులపై ప్రభావం చూపిస్తున్నాయని ఎన్ఎంసీ తన నివేదికలో పేర్కొంది.