Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యాదాద్రికి సత్వరమే పర్యావరణ అనుమతులు ఇవ్వాలి…నామ

యాదాద్రికి సత్వరమే పర్యావరణ అనుమతులు ఇవ్వాలి… నామ
రూ. 20వేల కోట్లకు పైగా ఖర్చుతో 64.20 శాతం పనులు పూర్తి
శరవేగంగా మిగతా పనులు : ఎంపీ నామ
సీఎం కేసీఆర్ దూరదృష్టితో యాదాద్రి విద్యుత్ కేంద్రం శరవేగంగా నిర్మాణం
బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు నాయకత్వంలో కేంద్ర పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి తన్మయ్ కుమార్ తో బీఆర్ఎస్ ఎంపీలు భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనులు 64.20 శాతం పూర్తయిన నేపథ్యంలో వెంటనే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు దివికొండ దామోదరావు, బడుగుల లింగయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలో నామ నాయకత్వంలో ఎంపీల బృందం కేంద్ర పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి తన్మయ్ కుమార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి, ప్రత్యేకించి ఒక లేఖ అందజేశారు. రూ. 29,965.48 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఇప్పటికే 20వేల కోట్లకు పైగా ఖర్చు చేసి, 64.20 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగతా పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎంపీలు కేంద్రం దృష్టికి తీసికెళ్ళారు. మిగతా యూనిట్లకు సంబంధించిన అన్ని రకాల పనులు త్వరితగతిన జరుగుతున్నాయని అన్నారు. గతంలో విద్యుత్ ప్రాజెక్టు ప్రాంగణంలో ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలతో బహిరంగ విచారణ నిర్వహించగా, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరై, ప్రాజెక్టు నిర్మాణాన్ని స్వాగతించి, సంపూర్ణ మద్దతు తెలిపారని ఎంపీల బృందం అదనపు కార్యదర్శికి వివరించింది. ఈ విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ లోటు ఉండదని వివరించారు. మొదటి రెండు యూనిట్లను ఆగస్టు 2023 నాటికి, బ్యాలెన్స్ యూనిట్లను మార్చి, 2024 నాటికి పూర్తి చేసేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని నామ పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారని నామ తెలిపారు. ఈ విద్యుత్ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూర దృష్టితో ఈ విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని నామ తన్మయ్ కుమార్ కు వివరించారు.

Related posts

ఉపాధ్యాయులను బోధ‌నేత‌ర ప‌నుల‌కు వాడద్దు: ఏపీ సీఎం జ‌గ‌న్‌ ఆదేశాలు!

Drukpadam

Why You Should Pound Chicken Breasts Before Cooking Them

Drukpadam

ఇంతకీ నిత్యానంద చెబుతున్న కైలాస దేశం ఎక్కడుంది?​​

Drukpadam

Leave a Comment