దేశపతి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి…!
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
- దేశపతి, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డికి అవకాశం
- సంఖ్యా బలం దృష్ట్యా ఏకగ్రీవం కానున్న ఎన్నిక
తెలంగాణ ఉద్యమంలో తన మాటలు పాటల ద్వారా ఉద్యమాన్ని ఉర్రుతలుగించిన అతికొద్దిమందిలో దేశపతి శ్రీనివాస్ ఒకరు . ఆయన నిత్యం తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం రేయింబవుళ్లు కష్టపడ్డారు . వినయం ,విధేయతతోపాటు , తెలంగాణ కోసం తెగించిన కొట్లాడారు . ఆయన అనేక వేదికలపై చేసిన ప్రసంగాలు , పాడిన పాటలు ప్రజలను ఉద్యమం వైపు ఆలోచించేలా చేసింది. ఆయన ఉద్యమం కోసం చేసిన త్యాగం ఫలితంగా ఆయన్ను సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ద్వారా సముచిత గౌరవం ఇచ్చినట్లు అయింది .
మరోవైపు హైదరాబాద్ కు చెందిన నవీన్ కుమార్ ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు మరో పర్యాయం అవకాశం లభించనుంది. ఇక, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురి కుమారుడు), అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి గతేడాది డిసెంబర్ లో కాంగ్రెస్ ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు సముచిత పదవి ఇస్తామని చేరిక సందర్భంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. సంఖ్యా బలం దృష్ట్యా ఈ మూడింటినీ బీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోనుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు అభ్యర్థుల ఎన్నిక లాంఛనం కానుంది. దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.