మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది.. స్టాలిన్ సంచలన ఆరోపణలు..
- నాగర్‌కోవిల్‌లో కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్టాలిన్
- బీహార్ కార్మికులపై దాడులు అవాస్తవమన్న సీఎం
- ప్రజలు లబ్ధిపొందడం ఇష్టంలేని కొన్ని దుష్టశక్తుల ప్రచారం మాత్రమేనని స్పష్టీకరణ
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన ఆరోపణ చేశారు. కొన్ని దుష్ట శక్తులు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అయితే, వారి కలలు ఏమాత్రం ఫలించబోవన్నారు. నాగర్‌కోవిల్‌లో నిన్న కరుణానిధి విగ్రహాన్ని స్టాలిన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల కార్మికులపై రాష్ట్రంలో దాడులు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు, సమాచారం వైరల్ అయిందని, దీనిపై ప్రభుత్వం ఆరా తీస్తే అవన్నీ నకిలీవని తేలిందన్నారు. ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగానే ఇలాంటి ప్రచారం జరుగుతోందన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేసినట్టు చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ద్రావిడ నమూనా అభివృద్ధి సాగుతోందని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రజలు లబ్ధిపొందడం సహించలేని కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, తమిళనాడులో బీహార్ కార్మికులపై దాడులు జరుగుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. వారికి రక్షణ కల్పించాలని స్టాలిన్‌ను కోరారు. మరోవైపు, బీజేపీ ఈ వ్యవహారంపై మండిపడింది. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.