లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేస్తారా …?
–ఎన్ని ఇబ్బందులు పెట్టిన తెలంగాణ బీజేపీకి తెలవంచదన్నకవిత
–కవిత కు నోటీసులపై బీఆర్ యస్ నేతల మండిపాటు …
–ఇది రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపణలు
–ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు
–అరెస్ట్ అయిన రామచంద్రపిళ్లై ఆమెకు బినామీగా ఉన్నారన్న ఈడీ
–గురువారం విచారణకు హాజరు కావాలంటూ కవితకు నోటీసులు
–పిళ్లైతో కలిసి విచారించే అవకాశం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ తప్పదా …ఆమెను రెండవసారి పిలవడం వెనక ఉద్దేశం అదేనా …కవితకు లిక్కర్ స్కాం కు ఉన్న సంబంధం ఏమిటి నిజంగా ఆమె బినామీలు ఇందులో ఉన్నారా ? వారి ద్వారా ఆమె వాటా పెట్టారా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో కవిత చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఒక పక్క ఆమె అరెస్ట్ తప్పదని బీజేపీ నేతలు ప్రకటిస్తున్న వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది . గురువారం విచారణకు హాజరు కావాలని నోటీసులో ఈడీ పేర్కొన్నది . ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర పిళ్లైని రెండు రోజులపాటు ప్రశ్నించిన అధికారులు తాజాగా అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. న్యాయస్థానం ఆయనకు వారం రోజుల కస్టడీ విధించింది.
ఆమె ను రెండవసారి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జరుచేయడంపై అనుమానాలు కలుగుతున్నాయి. లిక్కర్ స్కాం లో ఆమె పాత్ర ఉందని ,ఆమె అరెస్ట్ తప్పదని బీజేపీ నేతలు ప్రకటిస్తున్న వేళ ఈడీ చర్యలు బీజేపీ వాదనను బలపరిచేవిగా ఉన్నాయనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఆమె మాత్రం లిక్కర్ స్కాం తో తనకు ఎలాంటి సంబంధం లేదని గంటాపధంగా చెపుతున్నారు . తనను ఈ కేసులో ఇరికించేందుకు రాజకీయ కుట్రజరుగుందని ఆమె అభిప్రాయపడుతున్నారు .ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై విమర్శలు వస్తున్నా వేళ కవిత విషయంలో కూడా బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు లిక్కర్ స్కాం ను వినియోగిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కవితకు రామచంద్రపిళ్లై బినామీ అని, ఆమెకు లబ్ధి చేకూర్చేందుకు ఆయన అన్నీ తానై వ్యవహరించారని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌కు చెందిన ఇండోస్పిరిట్స్ సంస్థలో కవిత తరపున పిళ్లై భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కవితకు నోటీసులు జారీ చేశారు. పిళ్లైతో కలిపి ఆమెను విచారిస్తారని తెలుస్తోంది. కాగా, ఇదే కేసులో గతేడాది డిసెంబరు 11న కవితను ఆమె ఇంటి వద్దే సీబీఐ అధికారులు విచారించారు.
దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా: ఎమ్మెల్సీ కవిత…ముందుకు నిర్ణయించుకున్న షడ్యూల్స్ ఉన్నాయి .నాయాసలహా తీసుకుంటా …
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ కోసం ఈ నెల 9న ఢిల్లీకి రమ్మంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు వచ్చాయని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అయితే, ముందస్తు అపాయింట్ మెంట్లు ఉండడంతో ఈడీ నోటీసులపై ఎలా స్పందించాలనే విషయంపై న్యాయ సలహా తీసుకోనున్నట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు చాలా కాలంగా పెండింగ్ లో ఉందని, దానిని వెంటనే పాస్ చేయాలనే డిమాండ్ తో ఢిల్లీలో ధర్నా తలపెట్టిన విషయాన్ని కవిత గుర్తుచేశారు.
ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు గతంలోనే ప్రకటించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ చెప్పారు. ఈడీ నోటీసులపై తెలంగాణ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ తో చర్చించేందుకు కవిత ప్రగతిభవన్ కు వెళ్లనున్నట్లు సమాచారం. లిక్కర్ స్కాంతో తనకెలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. అయితే, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆమె తేల్చిచెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని, అయితే ముందస్తు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కోరతానని తెలిపారు.
ఈడీ నోటీసులకు తాను భయపడబోనని, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ తలవంచదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలోని బీజేపీ సర్కారు విచారణ సంస్థలను వాడుకుంటోందని విమర్శించారు. మరోవైపు, ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటికి వెళ్లే దారులను మూసేశారు.