Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కవితపై ఈడీ విచారణ… సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన!

కవితపై ఈడీ విచారణ… సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు

  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు
  • నేడు విచారణకు హాజరైన కవిత
  • ఈడీ విచారణ తీరుతెన్నులు వివరించిన సీబీఐ మాజీ జేడీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, లిక్కర్ స్కాం కేసుపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు.

సాధారణంగా సీబీఐ ఏదైనా కేసులో దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీని ఈడీకి కూడా పంపిస్తుంటారని వెల్లడించారు. ఏదైనా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో పరిశీలించడం, దర్యాప్తు చేయడం ఈడీ పరిధిలోకి వస్తుందని తెలిపారు. సెక్షన్ 3, సెక్షన్ 4 పీఎంఎల్ఏ అనుసరించి ఈడీ దర్యాప్తు పూర్తిగా మనీ లాండరింగ్ చుట్టూనే తిరుగుతుందని వివరించారు.

లిక్కర్ స్కాం కేసులో కూడా ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశారని, మనీశ్ సిసోడియాను కూడా అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. “వీళ్లందరూ చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించిన ఇంకేమైనా విషయాలు ఎమ్మెల్సీ కవిత గారికి తెలుసా? ఆమెకు ఈ కేసుతో సంబంధ ఉందా? లేదా? అనే అంశాలను పరిశీలించడానికి ఈడీ ఆమెకు నోటీసులు ఇవ్వడం, ఆమె విచారణకు హాజరుకావడం జరిగింది. ఇప్పటివరకు ఈడీ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించి, ఆమె చెప్పే సమాధానాలను లిఖితపూర్వకంగా నమోదు చేస్తారు. ఇదీ సర్వసాధారణంగా ఈడీలో జరిగే దర్యాప్తు” అని వివరించారు.

పీఎంఎల్ఏ చట్టం ప్రకారం ఎవరినైనా విచారణకు పిలిచినప్పుడు ఈడీకి సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయని వీవీ లక్ష్మీనారాయణ వివరించారు. “సెక్షన్ 50 ప్రకారం… ఎవరైతే నోటీసులు అందుకుంటారో వాళ్లు వచ్చి ఈడీ ముందు తమకు తెలిసిన సమాచారం అంతా ప్రస్తావించాలి. వాళ్లు ఇచ్చే స్టేట్ మెంట్లు కూడా సజావుగా ఉండాలి. ఆయా స్టేట్ మెంట్లపై వారు సంతకాలు పెట్టాలి. ఇవన్నీ పీఎంఎల్ఏ చట్టంలో ఉన్న నిబంధనలు. అదే… పోలీసు దర్యాప్తులో అయితే స్టేట్ మెంట్లపై సంతకాలు ఉండవు.

పీఎంఎల్ఏ చట్టాన్ని చాలా పకడ్బందీగా రూపొందించారు. ఎందుకంటే… మనీలాండరింగ్ అనేది చాలా తీవ్రమైన ఆర్థిక నేరం. బ్లాక్ మనీని విదేశాలకు హవాలా మార్గంలో పంపడం, లేకపోతే, విదేశాల నుంచి డబ్బును షెల్ కంపెనీల ద్వారా భారత్ కు తీసుకురావడం దేశ భద్రతకు, దేశ సమగ్రతకు ముప్పు కలిగించే అంశాలు.

ఒక్కోసారి ఈ నిధులు ఉగ్రవాదులకు కూడా వెళతాయని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చెప్పడమే కాదు, పీఎంఎల్ఏ లోని అంశాలన్నింటికి చట్టబద్ధత ఉందని విజయ్ మదన్ లాల్ కేసు తీర్పు సందర్భంగా స్పష్టం చేసింది.

పీఎంఎల్ఏ చట్టం చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో సెక్షన్ 24 ప్రకారం… తాము తప్పు చేయలేదని ఆరోపణలు ఎదుర్కొన్నవారే నిరూపించుకోవాల్సి ఉంటుంది. పోలీస్, సీబీఐ కేసుల్లో అయితే దర్యాప్తు సంస్థలే నిరూపించాల్సి ఉంటుంది. అందుకే ఈడీలో పీఎంఎల్ఏ చాలా ప్రత్యేకం, శక్తిమంతమైన చట్టంగా మారింది” అని లక్ష్మీనారాయణ వివరించారు.

Related posts

లాలూకు కిడ్నీ మార్పిడి విజయవంతం!

Drukpadam

హైద‌రాబాద్ అమ్మాయికి రూ.2 కోట్ల వార్షిక వేత‌నంతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం…

Drukpadam

భయమెందుకు? నేనేమీ కొర‌క‌నులే!: పుతిన్‌పై జెలెన్‌స్కీ అదిరేటి కామెంట్‌!

Drukpadam

Leave a Comment