రాహుల్ గాంధీపై అనర్హత వేటును తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్!
- పార్లమెంటులో రాహుల్ గాంధీపై అనర్హత వేటు
- మోదీ దురహంకారానికి పరాకాష్ఠ అంటూ కేసీఆర్ విమర్శలు
- ప్రజాస్వామ్యానికి చేటు కాలం దాపురించిందని వెల్లడి
- బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను అందరూ ఖండించాలని పిలుపు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై పార్లమెంటులో అనర్హత వేటు వేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ఠ అని విమర్శించారు.
రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా, అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును కూడా తమ హేయమైన చర్యల కోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం అని సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటు కాలం దాపురించిందని, మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతోందని మండిపడ్డారు. విపక్ష నేతలను వేధించడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వెలిబుచ్చారు.
నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నేతలపై అనర్హత వేటు వేయడం ద్వారా మోదీ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని వివరించారు. పార్టీల మధ్య ఉండే వైరుద్ధ్యాలకు ఇది సందర్భం కాదని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని పేర్కొన్నారు.