ఇండిగో విమానం ఎయిర్‌హోస్టస్‌తో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన!
- బ్యాంకాక్ నుంచి ముంబై వస్తున్న విమానంలో ఘటన
- మద్యం మత్తులో రెచ్చిపోయిన స్వీడెన్ దేశస్థుడు
- ఎయిర్ హోస్టస్‌తో అసభ్య ప్రవర్తన
- ఇతర విమాన సిబ్బంది, ప్రయాణికులపై దాడి
- విమానం లాండవగానే నిందితుడి అరెస్ట్, బెయిల్‌పై విడుదల
బ్యాంకాక్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో విమానంలో గురువారం ఓ ప్రయాణికుడు ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎయిర్‌హోస్టస్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని స్వీడెన్‌కు చెందిన క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్‌గా(62) గుర్తించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. క్లాస్ తొలుత ఆహారం విషయంలో సిబ్బందితో గొడవకు దిగాడు. అతడు కోరుకున్న ఆహారం లేదని విమాన సిబ్బంది చెప్పడంతో వివాదం మొదలైంది. అయితే.. ఎయిర్‌హోస్టస్ సూచన మేరకు అతడు చికెన్ తినేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో అతడికి చికెన్ విక్రయించేందుకు ఎయిర్‌హోస్టస్ పీఓఎస్ టర్మినల్‌తో అతడి వద్దకు రాగా నిందితుడు ఆమె చేతిని అసభ్యకరంగా తాకాడు. దీనిపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీంతో.. మరింత రెచ్చిపోయిన నిందితుడు అందరిముందూ ఆమెపై వేధింపులకు దిగాడు. ఆ తరువాత అతడు తోటి ప్రయాణికులతో పాటూ ఇతర విమాన సిబ్బందినీ వేధించాడని బాధిత ఎయిర్‌హోస్టస్ ఆరోపించింది. ఈ క్రమంలో గురువారం ఇండిగో విమానం ముంబై ఎయిర్‌పోర్టులో దిగాక పోలీసుల అతడిని అరెస్ట్ చేసి అంధేరీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం..నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. గత మూడునెలల్లో భారత విమానాల్లో ఇలాంటి ఘటన వెలుగు చూడటం ఇది ఎనిమిదోసారి కావడంతో కలకలం రేగుతోంది.