సీఎం జగన్ టూర్ లో బాలినేనికి అవమానం…!
- హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రిని ఆపిన పోలీసులు
- వాహనం వదిలి కాలినడకన రావాలని సూచన
- పోలీసుల తీరుపై మండిపడ్డ బాలినేని..
- సీఎం సభకు హాజరవకుండా వెళ్లిపోయిన నేత
ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మార్కాపురంలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. తనను అడ్డుకున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరుకాకుండా ఒంగోలు వెళ్ళిపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లా ఎస్పీ, సహచర నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బాలినేని వినిపించుకోకుండా వెళ్లిపోయారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఈబీసీ నిధులను విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా నేతలు, అధికారులు మార్కాపురం చేరుకున్నారు. మాజీ మంత్రి, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా తన అనుచరులతో కలిసి మార్కాపురం వచ్చారు. సీఎంను రిసీవ్ చేసుకోవడానికి హెలిప్యాడ్ దగ్గరికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని సూచించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని.. సీఎం పర్యటనకు హాజరుకాకుండా ఒంగోలు వెళ్లిపోయారు.