చీమలపాడు ఘటన దురదృష్టకరం …బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి …!
మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన సుధాకర్ రెడ్డి
–గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలి
–వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి
–బీఆర్ యస్ ర్యాలీలో పేల్చిన బాణాసంచా …పేలిన సిలండర్
–ఇద్దరు మృతి …పలువురికి గాయాలు
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని బీజేపీ నేత తమళనాడు రాష్ట్ర సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి వాపోయారు . ఈసందర్భంగా ఇద్దరు మృతి చెందడంతోపాటు , 10 మందికి గాయాలు అయినట్లు తెలిసిందని వారందరికీ మెరుగైన వైద్య సహాయం అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు . ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన పోలీసులు భాద్యత రహితంగా వ్యవహరించడం వల్లనే ఇది జరిగిందని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు . బాణాసంచాకు అనుమతి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు . ఇది అత్యంత ఘోరమైన సంఘటనగా నిలిచిందని అన్నారు. కొందరికి కాళ్ళు ,చేతులు తెగిపడటం , వారి ఆర్తనాదాలు పలువురిని కదిలించాయని అన్నారు . ఇందులో కొందరు పోలీసులకు , జర్నలిస్టులకు గాయాలైనట్లు తెలిసిందని క్షతగాత్రులకు అన్ని విధాలుగా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు . ఇప్పుడు విమర్శలకు , వివాదాలకు తావులేదని ముందు గాయపడ్డవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు .
గ్రామంలో బీఆర్ యస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విషాదకరంగా ముగియడంపట్ల పలు రాజకీయపార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. సమ్మేళనానికి ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం , అందులో బీఆర్ యస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చడం పై స్థానిక గ్రామప్రజలు మండిపడుతున్నారు .