మీకెన్ని బొక్కలు ఉన్నాయో.. మీ రాష్ట్రాన్ని ఎలా తగలేశారో.. మీ ప్రతిపక్షాలే చెబుతున్నాయ్!: హరీశ్ రావుపై ఏపీ మంత్రి కారుమూరి మండిపాటు
- ఏపీలో పాలనపై హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై రగడ
- హరీశ్ వస్తే అభివృద్ధిని చూపిస్తామన్న కారుమూరి నాగేశ్వరరావు
- ఒక్క వర్షానికే హైదరాబాద్ మునిగిపోతుందని ఎద్దేవా
- ముందు అక్కడి ప్రతిపక్షాలకు సమాధానాలు చెప్పాలని కౌంటర్
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి. రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు ఫలిస్తున్నాయి. ఇద్దరు సీఎంలమధ్య సంఖ్యత ఉన్న మంత్రులమధ్య మాటల యుద్ధం కొనసాగడం ఆశక్తిగా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు …ఇప్పటికే రెండు రాష్ట్రాల నీటిపంపకాల్లో పెండింగ్ లోనే ఉన్నాయి. విభజన సమస్యలు పరిస్కారం కాలేదు …విద్యత్ శాఖకు రావాల్సిన అలాగే ఉన్నాయి. హైద్రాబాద్ లో ఉన్న ఆస్తుల్లో తమకు వాటా ఉందని అందువల్ల వాటిని తమకు తెలియకుండా అమ్మటం చేయకుండా చూడాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం కోర్టును కూడా ఆశ్రయించింది.
ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి బిడ్డింగ్ వేస్తున్నట్లు తెలంగాణ నుంచి వార్తలు రావడంతో తెలంగాణ ఆ బిడ్డింగ్ లో పాల్గొంటున్నట్లు చెప్పడంతో దానిపై ఏపీ ఘాటుగా స్పందించింది . బిండ్డింగ్ వేయడం అంటే విశాఖ ఉక్కును ప్రవేట్ పరం చేయడానికి ఒప్పుకున్నట్లే కదా అని ఏపీ మంత్రులు తెలంగాణ పై మండిపడుతున్నారు . ఇలా అనేక సమస్యలపై తగాదాల నేపథ్యంలో మాటల యుద్ధం కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పాలనపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏపీలో పరిస్థితులకి, తెలంగాణలో పాలనకి జమీన్ ఆస్మాన్ ఫరక్ (భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా) ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. హరీశ్ రావు దౌర్భాగ్యపు మాటలు మానుకోవాలని సూచించారు.
హరీశ్ రావు ఏపీకి వస్తే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తామని కారుమూరి చెప్పారు. ‘‘ఒక్క వర్షం కురిసిందంటే చాలు హైదరాబాద్ మునిగిపోతుంది. హైదరాబాద్ లో ఇళ్ల మీది నుంచి నీళ్లు పోతున్నాయి. మీరేం చేశారు? హైదరాబాద్ పరిస్థితిని ఘోరంగా చేసింది మీరు’’ అని విమర్శించారు.
అన్ని సౌకర్యాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా తగలేసుకున్నారో ప్రజలు, ప్రతిపక్షాలే చెబుతున్నాయన్నారు. ‘‘మీకెన్ని బొక్కలు ఉన్నాయో, ఎన్ని లొసుగులు ఉన్నాయో.. రాష్ట్రాన్ని మీరు ఎంత తగలేశారో.. మీ ప్రతిపక్షాలే చెబుతున్నాయ్. వాళ్లకు సమాధానాలు చెప్పుకోండి’’ అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో రోడ్లు సరిగా లేవన్న హరీశ్ వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ‘‘హైదరాబాద్ లో మాత్రమే రోడ్లు వేస్తే అయిపోయిందా? మా రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మా ప్రజలకు ఎన్ని సదుపాయాలు అందుతున్నాయో వచ్చి చూడండి. మీరు ఓట్లు వేసే వాళ్లకే సేవ చేస్తున్నారేమో.. ఓట్లు వేయని చిన్నారులకు కూడా మా జగన్ సేవలు చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. చదువుల్లో ఏపీ 14 వ స్థానంలో ఉండేదని.. ఇప్పుడు 3వ స్థానానికి వచ్చిందంటే ఇది జగన్ కృషేనని మంత్రి కారుమూరి అన్నారు.
ఏమన్నానని ఎగిరెగిరి పడుతున్నారు.. ఆంధ్రా మంత్రులు మా జోలికి రాకండి.. మీకే మంచిది!: హరీశ్ రావు హెచ్చరిక…
తాను ఏమన్నానని ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ‘‘ఆంధ్రా మంత్రులు అనవసరంగా మా జోలికి రాకండి… మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే మీకే మంచిది’’ అంటూ హెచ్చరించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
‘‘మీ దగ్గర ఏమున్నదని ఓ మంత్రి అంటున్నారు. ఏముందో వచ్చి చూడండి. మా దగ్గర 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బీమా, రైతు బంధు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించాం. మీ దగ్గర ఏమున్నాయి?’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.
‘‘ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారు.. ఇప్పుడేమో అడగరు. హోదా అంశాన్ని కేంద్రం పక్కకి పెట్టినా పట్టించుకోరు. విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు. అధికారంలో ఉన్న వాళ్లు అడగరు.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మినా ఎవ్వరూ నోరెత్తరు. ప్రజలను గాలికి వదిలేశారు.. మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసి ఏపీని ఆగం చేశాయి’’ అని ఆరోపించారు.