దారులన్నీ మంచిర్యాల వైపే
రాష్ట్రం నలుమూలలనుంచి రానున్న జనం
33 జిల్లాల కాంగ్రెస్ నాయకలు సైతం
రాష్ట్ర కాంగ్రెస్ నాయత్వం కూడా..
ముఖ్య అతిధిగా వస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
భట్టి పాదయాత్ర సభతో కాంగ్రెస్ కు కొత్త కళ
సభా ప్రాంగణానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు
సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేపట్టిన హాత్ సే హాత్ జోడో-పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఈ నెల 14న మంచిర్యాలలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైన తప్పుడు కేసులు పెట్టి, రెండేళ్ల జైలు శిక్ష పడేట్టు చేసి, పార్లమెంట్ సభ్యత్యాన్నిరద్దు చేస్తూ భారత ప్రజాస్వామ్యంపై భారతీయ జనతాపార్టీ దాడి చేస్తోంది. ఈ దాడిని ఖండిస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి అయిన ఈ నెల 14న మంచిర్యాలలోని నస్పూర్ వద్ద కలెక్టరేట్ ఎదురుగానున్న మైదానంలో బాబా సాహెబ్ అంబెడ్కర్ సభా ప్రాంగణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలలనుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్య వాదులు, రాజ్యాంగం అమలు కోరుకునేవారు.. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాదాపు లక్షమంది ప్రజలు ఈ సభకు హాజరవుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందులో 30 నుంచి 40 వేల మంది మహిళలు సభలో పాల్గొంటారని స్థానిక కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది.
ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ ఈ సత్యాగ్రహ సభని శాసనసభ ఎన్నికల సమరభేరిగానే నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే ప్రత్యేకంగా ఈ సభకు హాజరు కావడం కూడా అందులో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు . కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
ప్రజలను కలవడం, వారి సమస్యలు తెలుసుకోవడమే ప్రధాన ఎజెండాగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తూ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చేరుకున్నారు. ఇప్పటికే బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి.. ప్రస్తుతం మంచిర్యాల నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారు.
సింగరేణి బొగ్గు గనులను ఓపెన్ కాస్ట్ సేరుతో ప్రైవేటు పరం చేయడం, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, జైపూర్ లోని సింగరేణి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ప్రైవేటుపరం చేస్తుండడం వంటి అంశాలపై భట్టి విక్రమార్క ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా మాట్లాడుతూ ప్రజల్ని చైతన్య వంతం చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ కు దూరమైన దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసీ, బడుగు, బలహీన వర్గాలను, పేదలను తిరిగి పార్టీకి దగ్గర చేసేందుకు భట్టి చేస్తున్న పాదయాత్రగా ఎంతగానో ఉపయోగపడిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని అంటున్నారు .