పరువునష్టం కేసులో రాహుల్ కు స్వల్ప ఊరటనిచ్చిన కోర్టు!
- గాంధీ హత్యకు, ఆరెస్సెస్ కు లింక్ పెడుతూ రాహుల్ వ్యాఖ్యలు
- పరువు నష్టం దావా వేసిన ఒక సంఘ్ కార్యకర్త
- 2018లో కోర్టుకు హాజరైన రాహుల్
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని భివండీ కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. ఒక పరువు నష్టం కేసులో కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి ఆయనకు శాశ్వత మినహాయింపును ఇచ్చింది. కేసు వివరాల్లోకి వెళ్తే మహాత్మాగాంధీ హత్యకు, ఆరెస్సెస్ కు ముడిపెడుతూ రాహుల్ వ్యాఖ్యలు చేశారని… ఈ వ్యాఖ్యలు ఆరెస్సెస్ పరువును తీసేలా ఉన్నాయంటూ సంఘ్ కార్యకర్త ఒకరు 2014లో భివండీ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణకు గాను 2018 జూన్ లో రాహుల్ కోర్టుకు హాజరయ్యారు.
మరోవైపు, తాను ఢిల్లీలో ఉంటున్నానని, తన నియోజకవర్గమైన వయనాడ్ లో తాను పర్యటనలు చేయాల్సి ఉంటుందని, అందువల్ల కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపును ఇవ్వాలని గత ఏడాది కోర్టును రాహుల్ కోరారు. తన బదులుగా తన న్యాయవాది విచారణకు హాజరవుతారని చెప్పారు. ఈ క్రమంలోనే తాము తదుపరి ఆదేశాలను జారీ చేసేంత వరకు రాహుల్ కు కోర్టు విచారణ నుంచి మినహాయింపును ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.