రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు అడగొద్దంటూ పోస్టర్!
- మధ్యప్రదేశ్ లో ఓ పాన్ షాప్ లో ఏర్పాటుచేసిన యజమాని
- ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ ప్రధాని కాలేడనే పోస్టర్ పెట్టినట్లు వెల్లడి
- ఓ కస్టమర్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిన పోస్టు
కిరాణా దుకాణాలు, పాన్ షాపులలో అరువు ఇవ్వబోమనే పోస్టర్లు కనిపించడం సాధారణమే! అయితే, యజమానులు దీనిని రకరకాలుగా చెబుతుంటారు. అరువు రేపు అనో, కస్టమర్ మాకు దేవుడితో సమానం.. అలాంటి దేవుడికి అప్పిచ్చే స్థితిలో లేము అనో బోర్డులు పెడుతుంటారు. మధ్యప్రదేశ్ లో ఓ పాన్ షాప్ యజమాని మాత్రం తన షాపులో ఓ వింత పోస్టర్ పెట్టాడు. కాంగ్రెస్ మాజీ చీఫ్, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకూ అరువు ఇవ్వబోనంటూ పోస్టర్ పెట్టాడు. ఈ ఏడాది జనవరిలోనే పోస్టర్ పెట్టినా.. ఇటీవల ఓ కస్టమర్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
ఛింద్వారా జిల్లా కర్బాలా చౌక్ లో మహమ్మద్ హుస్సేన్ కు ఓ పాన్ షాప్ ఉంది. తెలిసిన వారే కదా అనే ఉద్దేశంతో గతంలో చాలామందికి అరువు ఇచ్చానని, వారు తిరిగివ్వకపోవడంతో నష్టపోయానని హుస్సేన్ వివరించాడు. దీంతో అరువు ఇవ్వబోనంటూ ఇలా వింత పోస్టర్ ను ఏర్పాటు చేశానన్నాడు. అయితే, రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడన్నది తన అభిప్రాయం కాదని హుస్సేన్ తేల్చిచెప్పాడు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రధాని సీట్లో కూర్చునే పరిస్థితి లేదని వివరించాడు. వాస్తవానికి రాహుల్ ప్రధాని కావాలన్నదే తన కోరిక అని హుస్సేన్ చెప్పాడు.