భారతీయ రెస్టారెంట్ నిర్వాహకులకు బ్రిటన్ రాకుమారుడి ఊహించని సర్‌ప్రైజ్…
- సెంట్రల్ ఇంగ్లండ్‌లో ఇటీవల సతీసమేతంగా బ్రిటన్ రాకుమారుడు విలియమ్ పర్యటన
- స్థానిక బర్మింగ్‌హామ్‌లో భారతీయ రెస్టారెంట్ సందర్శన
- టేబుల్ కోసం ఫోన్ చేసిన కస్టమర్‌తో తానే స్వయంగా మాట్లాడి, బుక్ చేసిన రాకుమారుడు
- వంటకాలు సిద్ధం చేయడంలో విలియమ్, కేట్ దంపతుల సాయం
సెంట్రల్ ఇంగ్లండ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌ను సతీసమేతంగా సందర్శించిన బ్రిటన్ రాకుమారుడు అక్కడి వారికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేసుకునేందుకు ఫోన్ చేసిన కస్టమర్‌తో తానే స్వయంగా మాట్లాడి వివరాలు తీసుకున్నారు. వారి పేరిట ఓ టేబుల్ బుక్ చేశారు. ఈ క్రమంలో రెస్టారెంట్ పూర్తి అడ్రస్‌ను యజమానిని అడిగి తెలుసుకుని మరీ కస్టమర్‌కు చెప్పారు. అయితే, తానెవరో చెప్పకుండానే బ్రిటన్ రాకుమారుడు ఈ సంభాషణ అంతా కొనసాగించారు.
టేబుల్ ఎవరి పేరు మీద బుక్ చేయమంటారు? అయితే సరే.. రెండు పదిహేను కల్లా ఇక్కడికి వచ్చేయండి! అంటూ కస్టమర్‌తో ప్రిన్స్ విలియమ్ చెప్పారు. ఆ తరువాత రెస్టారెంట్‌లో వంటకాలు సిద్ధం చేయడంలో విలియమ్, కేట్ దంపతులు సాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి మరో చోటుకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ప్రిన్స్ విలియమ్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కస్టమర్‌కు సరైన అడ్రస్సే చెప్పామనుకుంటున్నాం అంటూ ఓ సరదా కామెంట్ కూడా చేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్‌గా మారింది.