గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ.. సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు!
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను డంప్ కేంద్రంగా మోదీ మారుస్తున్నారన్న నారాయణ
- ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్న
- అదానీకి నొప్పి తగలకుండా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శ
- బాగా సంపాదించిన తిమింగలాలకు సజ్జల కాపలాదారుడని ఆరోపణ
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ అని మండిపడ్డారు. బీజేపీ పెంపుడు కుక్కగా సీబీఐ వ్యవహరిస్తోందని, న్యాయవ్యవస్థ మీద మోదీ ప్రభుత్వం ఒత్తిడి పెడుతోందని ఆరోపించారు. మోదీ బాబా 30 దొంగల్లా పాలన సాగుతోందని, దేశంలో 30 మంది దత్తపుత్రులతో పాలన నడుస్తోందని విమర్శించారు.
శుక్రవారం మీడియాతో నారాయణ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను డంప్ కేంద్రంగా మోదీ మారుస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. అదానీకి నొప్పి తగలకుండా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
విభజన చట్టాలను అమలు చేయించుకోలేని బలహీన స్థితిలో జగన్ ఉన్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రోబో లాంటి వ్యక్తి అని.. ఎలాంటి సెంటిమెంట్స్ లేని వ్యక్తి అని అన్నారు. రాజన్న రాజ్యం అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక దోపిడీ రాజ్యంలా పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ఎలాంటి ఆస్తులు లేకపోతే సంతకం పెట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జీతాలు ఇవ్వలేని దివాలా స్థాయిలో ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని నారాయణ అన్నారు. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సజ్జల వ్యాఖ్యలు దురదృష్టకరం. బాగా సంపాదించిన తిమింగలాలకు సజ్జల కాపలాదారుడు. దోపిడీదారులకు సజ్జల అధికార ప్రతినిధి’’ అని తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ ఉక్కుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉన్న కన్సర్న్ కూడా ఏపీలో సీఎం జగన్ కి లేదని అన్నారు.