ఇటలీలో అక్కడ సెల్ఫీ దిగారంటే పాతిక వేలు ఫైన్!
- ఇటలీ, పోర్టోఫినో సిటీలో కొత్త రూల్ తీసుకొచ్చిన మేయర్
- ఉదయం నుంచి సాయంత్రం దాకా నిషేధాజ్ఞలు
- ట్రాఫిక్ జామ్ అవుతుండడమే కారణమని వివరణ
పర్యాటక ప్రాంతాలలో అందమైన దృశ్యం కనిపిస్తే మొదట చేసే పని జేబులోని స్మార్ట్ ఫోన్ తీసి ఓ సెల్ఫీ క్లిక్ చేయడమే.. అయితే, ఇటలీలోని ఓ సిటీలో మాత్రం ఆ పని చేయకూడదు. సెల్ఫీ దిగి ఆ ఫొటో చూసుకుంటూ మురిసిపోయే లోపల మీ జేబు కాస్తా ఖాళీ అవుతుంది. అక్షరాలా పాతిక వేలు (275 యూరోలు) ఫైన్ గా చెల్లించుకోవాల్సి వస్తుంది. తమ నగరానికి వచ్చే టూరిస్టులు ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగుతూ ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తున్నారని పోర్టోఫినో సిటీ మేయర్ ఈ రూల్ తీసుకొచ్చారు.
ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పోర్టోఫినో సిటీ కూడా ఒకటి.. ఈ సిటీలో ముఖ్యంగా రెండుచోట్ల సెల్ఫీల కోసం పర్యాటకులు ఎగబడుతుంటారు. దీంతో ఆ రెండుచోట్లా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఉదయం ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్ లో చిక్కుకుని అవస్థ పడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోకూడదని మేయర్ మాటియో వయాకవా ఆదేశాలు జారీ చేశారు.
కాదని సెల్ఫీలు తీసుకున్న వారిపై ఏకంగా 275 యూరోలు జరిమానా విధిస్తామని ప్రకటించారు. ఈ కొత్త రూల్ అమలయ్యాక సిటీలో ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరిపోయాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఇలా సెల్ఫీలపై నిషేధం విధించిన సిటీ పోర్టోఫినో ఒక్కటే కాదు.. అమెరికా, ఫ్రాన్స్, యూకేలలోని కొన్ని నగరాలలో కూడా ఇదే విధమైన ఆంక్షలు అమలవుతున్నాయి.