బీజేపీకి డిపాజిట్లు కూడా రావు, అమిత్ షా సభలో ఇందులో సగం లేరు: హరీష్ రావు…
- బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు.. డబుల్ స్టాండర్డ్ సర్కార్ అని ఎద్దేవా
- ఎన్ని ట్రిక్కులు చేసినా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వ్యాఖ్య
- కేసీఆర్ ప్రభుత్వం చేసింది చెప్పాలని కార్యకర్తలకు పిలుపు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్నటి చేవెళ్ల బహిరంగ సభ పైన, బీజేపీ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సోమవారం విమర్శలు గుప్పించారు. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కల్లూరు సభకు వచ్చిన దాంట్లో సగం మంది కూడా నిన్నటి అమిత్ షా సభలో లేరని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ లేదని, కనీసం డిపాజిట్లు కూడా రావన్నారు. బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని, డబుల్ స్టాండర్డ్ ప్రభుత్వాలు అన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలోకి వస్తామని చెబుతున్న బీజేపీ మాటలు ఎండమావే అన్నారు. నిజం చెప్పకుంటే అబద్ధాలు ప్రచారం అవుతాయని అంబేద్కర్ గారు చెప్పారని, కాబట్టి మీరంతా మన ప్రభుత్వం చేసింది చెప్పాలన్నారు. దేశంలో మొత్తం ఎంత పంట పండుతుందో… ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే అంత పండుతుందన్నారు. కరువు అనే పదాన్ని సీఎం కేసీఆర్ డిక్షనరీ నుంచి తొలగించారన్నారు. అకాల వర్షాలకు రైతులు అధైర్య పడొద్దని, మనది రైతు ప్రభుత్వమన్నారు.