ముంబైలో తాగేందుకు నీళ్లు ఉండవా?: ఔరంగాబాద్ బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్…
- దేశంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదన్న బీఆర్ఎస్ అధినేత
- ఎంత త్వరగా మేల్కొంటే అంత త్వరగా బాగుపడతామన్న కేసీఆర్
- మార్పు వచ్చే వరకు పోరాడతామన్న తెలంగాణ సీఎం
ఔరంగాబాద్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ మార్పు కోసం పుట్టిన పార్టీ అన్నారు. ఒక కులం, ఒక మతం, ఒక వర్గం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ కాదని, దేశంలో మార్పు తమ లక్ష్యమని చెప్పారు. మార్పు వచ్చే వరకు పోరాడతామన్నారు. మార్పు రానంత వరకు దేశం ముందుకు వెళ్లదన్నారు. మహారాష్ట్రలో తాము అధికారంలోకి వస్తే ఇంటింటికి సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు. ఉచిత కరెంట్ ఇస్తామని, రైతులను ఆదుకుంటామని చెప్పారు.
‘మహారాష్ట్ర పవిత్ర భూమికి నమస్కారం. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది. బీఆర్ఎస్‌కు ఒక లక్ష్యం ఉంది. నా మాటలను విని ఇక్కడే మర్చిపోకండి. నా మాటలపై మీ గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులతో చర్చించండి. ఈ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించండి. దేశం ఉండాల్సిన స్థితిలో ఉందా? లేదా? అనే అంశంపై చర్చ పెట్టండి’ అని కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉందని, మార్పు జరగాల్సిన అవసరం ఉందని, ఒక పార్టీ గెలిస్తే మరో పార్టీ ఓడిపోవడం పరివర్తన కాదని, ప్రజల ఆకాంక్ష గెలవడం ముఖ్యమన్నారు.
దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందని, ఎంత త్వరగా మేల్కొంటే అంత తర్వగా బాగుపడుతామన్నారు. దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ముంబై దేశ ఆర్థిక రాజధాని అని, కానీ తాగేందుకు సరైన నీళ్లు లేవన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణలో మంచినీటి సమస్య లేకుండా చేశామని, తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని, తెలంగాణలో సాధ్యమైనవి మహారాష్ట్రలో ఎందుకు కావని ప్రశ్నించారు.
అంతకుముందు….
బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఔరంగాబాద్ వెళ్లిన కేసీఆర్, ఛత్రపతి శంభాజీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరాఠా ప్రజలకు అభివాదం చేసిన కేసీఆర్.. ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్, జ్యోతిబా పూలే, సావీత్రిబాయి పూలేతో పాటు పలువురు మహనీయులను గుర్తుకు చేసుకున్నారు. పలువురికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.