డిగ్రీ చదువుకుంటూనే నెలకు రూ.10 వేల వేతనం!
- స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి.. ‘సెక్టార్ స్కిల్ కౌన్సిల్’ సహకారంతో నిర్వహణ
- మూడు రోజులు క్లాసులు.. మూడు రోజులు పరిశ్రమలో ఇంటర్న్ షిప్
విద్యార్థులు ఓవైపు చదువుకుంటూనే మరోవైపు నెలకు రూ.10 వేలు సంపాదించే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 1,054 డిగ్రీ కాలేజీలుండగా, అత్యధిక అడ్మిషన్లున్న 103 కాలేజీల్లో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ‘సెక్టార్ స్కిల్ కౌన్సిల్’ సహకారంతో ఈ కోర్సులను నిర్వహించనుంది.
సంబంధిత సెక్టార్‌లోని పరిశ్రమలతో ‘సెక్టార్ స్కిల్ కౌన్సిల్’, కాలేజీలు పరస్పరం ఎంవోయూ కుదుర్చుకుంటాయి. ఇందుకు వర్సిటీలు చొరవ తీసుకుంటాయి. సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ద్వారా రాష్ట్రంలో 10 రకాల స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెడతారు.
ఒక కాలేజీలో ఒక కోర్సుకు అనుమతిచ్చి, గరిష్ఠంగా 60 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. విద్యార్థులు మూడు రోజుల పాటు కాలేజీలో, మిగిలిన మూడు రోజులు పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. అంటే పరిశ్రమలో 15 రోజులు పనిచేస్తే నెలకు రూ.10 వేల వేతనం ఇస్తారు.
కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్‌మెంట్స్ కల్పిస్తారు. బీకాం, బీబీఏ విద్యార్థులకు రిటైలింగ్, ఈ కామర్స్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్ కోర్సుల్లో ఏదైనా ఒకదాన్ని కాలేజీలో అనుమతిస్తారు. బీఏ విద్యార్థుల కోసం కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోర్సులను నిర్వహిస్తారు. బీఎస్సీ విద్యార్థులకు ఫార్మా, యానిమేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోర్సులను నిర్వహిస్తారు.