కర్ణాటకలో ప్రధాని పర్యటన బీజేపీని గట్టెక్కిస్తుందా …?
-కర్ణాటకలో అధికారం కోసం బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ…!
-దక్షిణాదిన బీజేపీ ప్రతిష్టకు సవాల్ గా మారిన కర్ణాటక ఎన్నిక
-ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాలు
-తెలంగాణ ఎన్నికలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం
-40 నుంచి 50 నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ణయించే తెలుగు ఓటర్లు
-బెంగుళూరులో సహా 12 జిల్లాల్లో తెలుగువారి ప్రభావం
కర్ణాటకలో ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ఈ ఎన్నికలకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు . పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత అంత పెద్ద ఎత్తున బీజేపీ ఇక్కడ కేంద్రకరించింది. మూడు రోజులు కర్ణాటకలో మకాం వేసి 22 సభల్లో పాల్గొనే విధంగా ఆయన పర్యటన ఖరారు అయింది. సభలతో పాటు రోడ్ షో లు కూడా ప్రధాని చేయబోతున్నారు . కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి తక్కువకాకుండా ప్రచారం చేస్తుంది.
మే 10 న జరగనున్నకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ ,కాంగ్రెస్ లు హోరాహోరీ తలపడుతున్నాయి …దక్షిణాదిన ఉన్న ఒక్కరాష్ట్రాన్ని కాపాడుకోవడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కర్ణాటక ఎన్నిక బీజేపీకి ప్రతిష్టకు సవాల్ గా మారింది. కాంగ్రెస్ , జేడీఎస్ లు కూడా అదే స్థాయిలో బీజేపీని ఢీకొనేందుకు యధాశక్తి కృషి చేస్తున్నాయి. రాహుల్ భారత్ జోడో పాదయాత్ర , మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు కావడం , కర్ణాటకలో పటిష్టమైన నాయకత్వం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. జేడీఎస్ కు అధికార చేపట్టే సీట్లు రాకపోయినా 2018 ఎన్నికల్లో లాగా కింగ్ మేకర్ పాత్ర పోషించాలని చూస్తుంది. గత ఎన్నికల్లో జేడీఎస్ కు అన్ని విధాలా సహాయపడిన బీఆర్ యస్ నేత కేసీఆర్ కర్ణాటక ఎన్నికలకు దూరంగా ఉండటం ఆసక్తిగా మారింది.
గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగుళూరు శాసనసభలో 224 స్థానాలు ఉండగా 2613 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు . వీరిలో బీజేపీ మొత్తం 224 సీట్లలో పోటీ చేస్తుండగా , కాంగ్రెస్ 223 ,ఆమ్ ఆద్మీ పార్టీ 209 ,జేడీఎస్ 207 ,బీఎస్పీ 133 ,సిపిఐ నుంచి 4 గురు ,సిపిఎం నుంచి ముగ్గురు , ఆర్పీఐ ముగ్గురు , స్వతంత్రులు 918 మంది రంగంలో ఉన్నారు .
224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నశాసనసభలో మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు రావాల్సి ఉంది. చిన్న చితక పార్టీలు స్వతంత్రులు పోటీచేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ,బీజేపీ , జేడీఎస్ లమధ్యనే ప్రధాన పోటీ …2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు సంపాదించి అతిపెద్ద పార్టీగా అవతరించింది . కాంగ్రెస్ కు 78 జేడీఎస్ కు 37 సీట్లు వచ్చాయి. గవర్నర్ అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు కు ఆహ్వానించారు . యడుయూరప్ప నేతృత్వంలో ఏర్పడిన మైనార్టీ సర్కార్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోలేక పోయింది.దీంతో జేడీఎస్ నేత కుమారస్వామి కి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు .కానీ కొంతకాలానికే కాంగ్రెస్ ,జేడీఎస్ లోని శాసనసభ్యులను ప్రలోభ పెట్టడం ద్వారా బీజేపీ కుమారస్వామి ప్రభుత్వాన్ని గద్దెదించి తిరిగి యడియూరప్ప నాయకత్వంలో అధికారం చేపట్టింది.
కొంతకాలానికి అవినీతి ఆరోపణలతో యడియూరప్పని పదవి నుంచి తప్పించిన బీజేపీ అధిష్టానం బొమ్మై ని సీఎం కుర్చీలో కూర్చో బెట్టింది. బొమ్మై ప్రభుత్వం పై పీకల్లోతు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవినీతి సర్కార్ అనే ఆరోపణలను ఆయన మూటకట్టుకున్నారు . బీజేపీకి చెందిన అనేకమంది కీలక నేతలు బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేరారు . అయినప్పటికీ బీజేపీ తన వ్యూహాలతో ఎలాగైనా కర్ణాటకకు తిరిగి గెలవడం ద్వారా తెలంగాణ లో పాగా వేయాలని చూస్తుంది. ప్రధాని మోడీ , కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా కర్ణాకట ఎన్నికలపై కేంద్రీకరించారు . కాంగ్రెస్ కూడా కర్ణాటక ఎన్నికలను అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది . రాహుల్ గాంధీ , మల్లిఖార్జున ఖర్గే , సిద్దరామయ్య ,డీకే శివకుమార్ లు ప్రధాన ఎన్నికల క్యాంపెయినర్లుగా ప్రచారం తారాస్థాయికి చేరుకుంది . అనేక సర్వే సంస్థలు ఈసారి తిరిగి హంగు అని చెపుతున్నాయి. కొన్ని మాత్రం కాంగ్రెస్ కు ఓటర్లు మొగ్గుచూపుతున్నారని తెలిపాయి. మరికొన్నిసర్వేలు ఈసారి కూడా జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర వహిస్తుందని పేర్కొన్నాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఒకటి అర మినహా ఏ సర్వే సంస్థ చెప్పలేదు … అయితే ఏమి జరుగుతుంది . సర్వే సంస్థల సర్వేలు నిజమవుతాయా లేదా అనేది మే 10 పోలింగ్ తర్వాత మే 13 న జరిగే కౌంటింగ్ వరకు ఎదురు చూడాల్సిందే …
కర్ణాటక ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల ఆసక్తి
కర్ణాటక ఎన్నికల పై తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చేస్తున్నాయి. ప్రధానంగా వచ్చే నవంబర్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు కర్ణాటక ఫలితాలపై ఆధారపడి ఉంటాయనేది పరిశీలకుల అభిప్రాయం .కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ,తెలంగాణాలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందని ,అదే బీజేపీ గెలిస్తే బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు ఉన్నాయి.
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై తెలుగువారి ప్రభావం…
కర్ణాటక మొత్తం జనాభా ఏడు కోట్లు ఉంటే.. సుమారు కోటి మంది వరకూ తెలుగోళ్లు ఉంటారని అంచనా . ఒక్క బెంగళూరు నగరంలోనే 25 లక్షల మంది వరకూ ఉంటారని అంటున్నారు . కన్నడ, ఉర్దూ తర్వాత తెలుగు మాట్లాడేవారే ఎక్కువ. 20 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యం తారుమారు చేయగలశక్తి తెలుగువారికి ఉంది . ‘రాష్ట్రం మొత్తమ్మీదా 40 నుంచి 50 స్థానాల్లో తెలుగు ఓటర్లే కీలకం. రాష్ట్రంలో 12 జిల్లాల్లో తెలుగు ప్రజల జనాభా ప్రభావం ఉంటుంది .ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న హెబ్బాల్, యలహంక, దేవనహళ్లి, బళ్లారి వంటి నియోజకవర్గాలు.. హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌లోని బీదర్, కలబుర్గి, రాయచూర్, యాదగిరి, బసవకళ్యాణ వంటి దాదాపు 20 సీట్లు, కోలారు, తుముకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపూర్ జిల్లాల్లో తెలుగు ప్రజలు గణనీయంగా ఉన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు అక్కడి రాజకీయాల్ని ప్రభావితం చేయడమే కాదు.. అవసరమైతే తుది ఫలితాన్ని మార్చేయగల సత్తా ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపైనా ప్రభావం చూపుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అధికార బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌లకు ఈ ఎన్నికలు ఎంతో కీలకం.
మొత్తం 12 జిల్లాల్లో తెలుగువారి ప్రభావం ఉండగా కోలార్ లో అయితే 76 శాతం ఓటర్లు తెలుగు మాట్లాడేవారు కావటం గమనార్హం. అచ్చంగా తెలుగు ఓటర్ల విషయానికి వస్తే.. బీదర్.. కలబురిగి.. కోలార్.. బళ్లారిలో 30 శాతం ఉన్నారు . కర్ణాటక రాజధాని బెంగళూరులో 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపు 25 లక్షల మంది తెలుగోళ్లు ఉన్నారు. దీంతో.. వారి ఓట్లు తుది ఫలితం మీద తీవ్ర ప్రభావాన్ని కచ్చితంగా చుపిస్తాయని రాజకీయపరిశీలకుల అభిప్రాయం .
ఫలితాన్ని శాసించేంది తెలుగువారే కాబట్టి ఎన్నికల్లో వారి సంక్షేమం కోసం పలు పార్టీలు వాగ్దానాలు కూడా చేస్తుంటాయి. 2018 ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) బెంగళూరు నగరంలో తెలంగాణ భవన్ కోసం భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చింది’ . తెలుగు పండుగలు ,తెలుగువారి సాంస్కృతిక కార్యక్రమాలకు అన్ని రాజకీయపార్టీలు సహకరిస్తున్నాయి.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడానికి తెలుగు ఓటర్లే కారణమని విశ్లేషకులు అభిప్రాయం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కారు అన్యాయం చేసిందనే భావన బలంగా నాటుకుపోయింది. గత ఎన్నికల్లో పలువురు బలమైన బీజేపీ నేతలు పరాజయం వెనుక తెలుగు వాళ్ళు ఉన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.
తెలుగు ఓటర్లు అధికంగా ఉండే రాయచూరు.. బళ్లారి.. చిక్ బళ్లాపూర్.. కోలార్ జిల్లాల్లో తెలుగు ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే నియోజకవర్గాలు 46 వరకూ ఉన్నాయి. గత ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ 32 చోట్ల విజయం సాధిస్తే.. 9 స్థానాల్లో జేడీఎస్, కేవలం 5 స్థానాలతోనే బీజేపీ సరిపెట్టుకుంది. పలువురు వ్యాపారులు.. ఐటీ ఉద్యోగులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. హోటల్ నిర్వాహకులతోపాటు వివిధ రంగాలకు చెందిన తెలుగువారు ఎక్కువగా ఉండటంతో.. వారి ప్రభావం ఎన్నికల మీద స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.