రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో మళ్లీ చుక్కెదురు!
- మోదీ అనే ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యలు
- రెండేళ్ల జైలుశిక్ష విధించిన సూరత్ కోర్టు
- రాహుల్ గాంధీ పిటిషన్ పై నేడు గుజరాత్ హైకోర్టులో విచారణ
- వేసవి సెలవుల తర్వాతే ఉత్తర్వులు ఇస్తామన్న హైకోర్టు
- తనను అరెస్ట్ చేయవద్దని రాహుల్ మధ్యంతర పిటిషన్
- పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఉంటోందంటూ వ్యాఖ్యలు చేసి రెండేళ్ల జైలుశిక్షకు గురైన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ కేసు నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువునష్టం దావా వేయగా, సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా ఊరట లభించడంలేదు.
తాజాగా ఈ కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. జైలుశిక్షపై మధ్యంతర స్టే కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ పై వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. రాహుల్ పిటిషన్ పై జూన్ 4 తర్వాత తీర్పు ఉంటుందని వెల్లడించింది.