కర్ణాటకలోనేనా.. తెలంగాణకు ఉచితంగా ఇవ్వరా?: మోదీకి కేటీఆర్ సూటి ప్రశ్న…
- ఉచితాల కల్చర్ సరికాదని ఇన్నాళ్లు పలికి, ఇప్పుడెలా ఇస్తున్నారన్న కేటీఆర్
- కర్ణాటకకు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చినప్పుడు మిగతా రాష్ట్రాలకూ ఇవ్వాలని వ్యాఖ్య
- పిరమైన ప్రధాని అంటూ మోదీపై సెటైర్
ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బీజేపీ తన కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చెబుతోందని, మరి తెలంగాణ మాటేమిటని మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. ఫ్రీబీ కల్చర్ సరైనది కాదని ఇన్నాళ్లు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ గొంతు చించుకున్నారని, ఇప్పుడు అదే పార్టీ మూడు సిలిండర్లు ఉచితం, పాలు ఉచితం అని కర్ణాటకలో తమ మేనిఫెస్టోలో ప్రకటించారని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని తాము ఒక ప్రశ్న అడుగుతున్నామని, ఆయన దేశానికి ప్రధానియా? లేక కర్ణాటకకు ప్రధానియా… కర్ణాటకకు ఇచ్చినప్పుడు తెలంగాణకు మూడు సిలిండర్లు ఉచితంగా ఎందుకు ఇవ్వరన్నారు. మిగతా 28 రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వరని అడిగారు. రూ.400 ఉన్న సిలిండర్ రూ.1200కు పెరిగిందని, జీఎస్టీ పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. మోదీ పిరమైన ప్రధాని అని ఎద్దేవా చేశారు.
అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం కేసీఆర్ వాన ప్రభావ ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారన్నారు. పంట కోతకు వచ్చే సమయంలో రైతు నోట ఈ వడగళ్ల వాన మట్టి కొట్టిందన్నారు. పలుచోట్ల ముప్పై శాతం నుండి యాభై శాతం ధాన్యం రాలిపోయిందన్నారు. ఇలాంటి సమయంలో రైతులకు అండగా ఉంటామన్నారు.
బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అన్నారు. రైతుకు భరోసాను ఇచ్చే పార్టీ తమది అన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ వంటి పథకాలతో కేసీఆర్ రైతులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే చాలా చోట్ల తక్షణ సాయం ప్రకటించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హెక్టారుకు రూ.25,000 పరిహారం అందిస్తున్నట్లు చెప్పారు. అంటే ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నామన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా ఇలా లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతు నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలన్నారు. కొన్నిచోట్ల ధాన్యం రంగు మారిందని, కొన్నిచోట్ల మొలకెత్తిందని, కొన్నిచోట్ల తడిసిందని చెబుతున్నారన్నారు.