Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆలులేదు …సూలులేదు సీఎం సీటు కోసం కాంగ్రెస్ లో కొట్లాట …

ఆలులేదు …సూలులేదు సీఎం సీటు కోసం కాంగ్రెస్ లో కొట్లాట …
-రేసులో తాము ఉన్నామంటున్న భట్టి ,రేవంత్ రెడ్డి ,జానారెడ్డి ,జగ్గారెడ్డి
-అందుకే పాదయాత్రల జోరు…నిరుద్యోగ నిరసన ర్యాలీలు
-ఒకరిపై మరొకరు పై చేయి సాదించేందుకు పన్నాగాలు
-వీలుంటే తమకు పోటీ వస్తారని అనుకున్న వారిని బలహీనపరిచే ప్రయత్నాలు…
-సీట్ల వేటలో కసరత్తులు …గెలిచే వారికీ కాకుండా డబ్బులు ఇచ్చినవారికి -టికెట్స్ అమ్ముకుంటారనే అపవాదు

ఆలులేదు …సూలులేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి … అధికారం వస్తుందో రాదో తెలియదు …అయినా సీఎం సీటు కోసం ఇప్పటినుంచే కుస్తీలు, కొట్లాటలు …రేసులో నేనంటే …నేనని ఉరుకులు ,పరుగులు … ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి , సీనియర్ నేత కుందూరు జానారెడ్డి , మరో నేత జగ్గారెడ్డి లు లైన్లో ఉన్నారనే ప్రచారం . ఒక వేళ కాంగ్రెస్ కు మెజార్టీ వస్తే మరికొందరు తామెందుకు సీఎం కాకూడదని ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు . కాంగ్రెస్ కు ప్రజల్లో సానుభూతి ఉన్నా పార్టీ నేతల వైఖరి శాపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి .

తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర శాసనసభలో మొత్తం 119 సీట్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ కావాలంటే 60 సీట్లలో గెలవాలి … త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వచ్చే ఎన్నికలు అత్యత కీలకంగా మారనున్నాయని రాజకీయపరిశీలకుల అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి అధికారం చేపట్టాలని బీజేపీ అత్యంత పకడ్బందీగా పావులు కదుపుతుంది. ఇందుకోసం డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కొత్త నినాదం ఎత్తుకుంది .అంతేకాకుండా ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని రెచ్చగొట్టడం ద్వారా హిందువుల ఓటు బ్యాంకు ను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నమైంది. అందుకే రాష్ట్రంలో అంతకు ముందు ఇటీవల పర్యటించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను ఎత్తి వేస్తామని ప్రకటించారు . దీనిపై విమర్శలు ఉన్నాయి. దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణ లక్ష్యంగా బీజేపీ దృష్ఠి పెట్టింది .ప్రధాని నరేంద్రమోడీ , హోమ్ మంత్రి అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా లు పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి బహిరంగసభల్లో పాల్గొన్నారు . చేరికల కమిటీ అంటూ ఒక దాన్ని ఏర్పాటు చేశారు . మాజీమంత్రి టీఆర్ యస్ బహిష్కృత నేత హుజారాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నేతృత్వంలో కమిటీ పనిచేస్తుంది. ఇప్పటికే వివిధ పార్టీల్లో ఉన్న అనేక మంది అసమ్మతినేతలను కలిసి బీజేపీలోకి రావాలని ఆహ్వానాలు పలికింది. అయినప్పటికీ స్పందన అంతగా ఉన్నట్లు కనిపించడంలేదని సమాచారం ..

రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ , మల్లిఖార్జున ఖర్గే వచ్చి వరంగల్ , మంచిర్యాలలో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సభలకు ప్రజల నుంచి స్పందన రావడంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్ మీద ఉన్నాయి. దీనికి తోడు ‘రాహుల్ గాంధీ భారత్ జోడో’ యాత్రకు కొనసాగింపుగా “రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో” యాత్ర , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క” పీపుల్స్ మార్చ్” లు మూలాన పడ్డ కాంగ్రెస్ ఖద్దరు చొక్కాలను బయటకు తెప్పిస్తున్నాయి. ఈనెల 8 వ తేదీన ప్రియాంక గాంధీ నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొంటారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరస కార్యక్రమాలొతో కాంగ్రెస్ పార్టీలో కదలికలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ కూడా జానారెడ్డి ఆధ్వరంలో చేరికల కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు ఎవరిని చేర్చుకున్న దాఖలాలు కనిపించడంలేదు . ఈ కమిటీ అసలు ఉందా…? లేదా …? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

తెలంగాణ వచ్చిన తర్వాత వరసగా రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడి అధికార పార్టీకి జైకొట్టారు . అయినా వాటినుంచి గుణపాఠాలు తీసుకోలేదు .పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో గ్యారంటీ లేదు .వచ్చినా ఐక్యంగా ఉండి కలిసి కట్టుగా పనిచేద్దామన్న సోయి , ద్యాస ఆపార్టీ నాయకులను ఉన్నట్లు కనిపించడంలేదు . ఇప్పటికే పార్టీలో కోవర్టులు ఉన్నారని వారు అధికార టీఆర్ యస్ పార్టీకి ఉపయోగపడుతున్నారని కొందరిపై అధిష్టానానికి సమాచారం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి …మరికొందరు బీజేపీకి ఉపయోగపడే ప్రకటనలు గుప్పించి నిరంతరం పార్టీని పార్టీ నాయకత్వాన్ని బలహీన పర్చే చర్యలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి . సీనియర్లు ,జూనియర్ల మధ్య తగాదాలు చెప్పక్కర్లేదు …అందరు బజారునపడి కొట్టుకుంటున్నారు . తమకు పదవులు ఇవ్వలేదు సరికదా కొత్తగా వచ్చినవారికి పదవులు కట్టబెట్టటం ఏమిటని హైకమాండ్ వరకు ఫిర్యాదుల పర్వం కొనసాగింది. ఏ జిల్లాకు ఆజిల్లా చూసుకునే స్థాయికూడా లేని నాయకులు రాష్ట్ర నాయకత్వంపై కన్నేశారు .మాకు అవకాశం ఇస్తే తడాఖా చూపిస్తామని తొడలు కొట్టి సవాల్ చేస్తున్నారు.

ఇక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ మూడవసారి అధికార పీఠాన్ని కైవశం చేసుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. వివిధ పార్టీల్లో ఉన్న నేతల కదలికలను నిశితంగా పరిశీలిస్తుంది. వారి బలహీతలను తనకు బలంగా మార్చుకోవడంలో కేసీఆర్ దిట్ట అనే పేరుంది.అందుకు అనుగుణంగా ఆయన పావులు కదిపే అవకాశాలు లేకపోలేదు . అయితే రెండు సార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి తోడు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోవం , రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కొత్త బిల్డింగ్ లు నిర్మాణాలు చేపట్టడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులకు, పెన్షన్ దారులకు నెలనెలా ఇవ్వాల్సిన జీతాలు సరిగా అందటంలేదు . వారికీ రావాల్సిన బినిఫిట్స్ కు దిక్కు మొక్కు లేదు … దాచుకున్న డబ్బులు కూడా చేతికి రావడం కష్టంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇక డి ఏ ల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు .ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని సంఘ నేతలు మాట్లాడకున్నా, ఉద్యోగులు మండి పడుతున్నారు . ఇక దళిత ముఖ్యమంత్రి , దళిత బంధు , రైతుల రుణమాఫీ లపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. దళితబంధు లో కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు వసూల్ చేస్తున్నారని తన దగ్గర సమాచారం ఉందని , అలాంటి వారి తోకలు కట్ చేస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలోహెచ్చరించడం ఆపార్టీ ప్రజాప్రతినిధుల్లో ఉన్న అవినీతి చర్యలను బయట పెట్టింది. చూద్దాం ముందు ,ముందు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో …

Related posts

పొత్తులు ఉన్నా లేకున్నా కమ్యూనిస్టు అభ్యర్థుల గెలుపే లక్ష్యం …కూనంనేని

Drukpadam

తెలంగాణ నీటికోసం ఎందాకైనా … మేము గాజులు తొడుక్కులేదు …మంత్రి పువ్వాడ…

Drukpadam

కాంగ్రెస్‌ పార్టీ ని అధికారంలోకి తెచ్చేందుకే పార్టీలో చేరాం: ఎమ్మెల్యే సీతక్క

Drukpadam

Leave a Comment