నాటకీయ పరిణామాల మధ్య రాజీనామాను ఉపసంహరించుకున్న శరద్ పవార్…
- మూడు రోజుల నాటకీయ పరిణామాలకు ముగింపు
- ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగుతానని శరద్ పవార్ ప్రకటన
- బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని వ్యాఖ్య
ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శరద్ పవార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని చెప్పారు. పవార్ రాజీనామాను తిరస్కరిస్తున్నట్టు ఆ పార్టీ ప్యానల్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గంటల వ్యవధిలోనే పవార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అన్ని విషయాలను పునఃపరిశీలించిన తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని పవార్ తెలిపారు. ఎన్సీపీ అధ్యక్షుడిగా ఇకపై కూడా కొనసాగుతానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి సీపీఎం సీతారాం ఏచూరి వరకు అందరూ తనను కోరారని అన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పవార్ చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీలో వ్యవస్థాపక మార్పులపై దృష్టి సారిస్తానని తెలిపారు. కొత్త నాయకత్వానికి ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తానని తెలిపారు. దీంతో, గత 3 రోజులుగా ఎన్సీపీలో కొనసాగుతున్న నాటకీయ పరిణామాలకు తెరపడినట్టయింది.