పెళ్లిపీటలపైనే వధువుపై చేయి చేసుకున్న వరుడు.. వెళ్లిపోయిన పెళ్లి కుమార్తె!
- ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘటన
- తాగిన మైకంలో వధువు నుదుట సిందూరం దిద్దలేకపోయిన వరుడు
- సిందూరం చల్లడంతో అడ్డుకున్న వధువుపై చేయిచేసుకున్న పెళ్లికొడుకు
- పోలీస్ స్టేషన్‌కు పంచాయితీ
మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వరుడి ప్రవర్తనతో మనస్తాపం చెందిన వధువు పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా మాణిక్‌పూర్‌లో జరిగిందీ ఘటన. పెళ్లికి ముందు వధూవరులిద్దరూ కలిసి మండపంలో పూజలు నిర్వహించారు. అప్పటికే తాగిన మత్తులో ఉన్న వరుడు.. వధువు నుదుట సిందూరం దిద్దాల్సి ఉండగా తడబడ్డాడు. సిందూరం దిద్దేందుకు నానా అవస్థలు పడ్డాడు.
చివరికి ఆమెపై సిందూరం చల్లటం ప్రారంభించాడు. వధువు అతడిని ఆపే ప్రయత్నం చేయగా, మైకం మత్తులో ఆగ్రహంతో ఊగిపోయిన వరుడు ఆమెపై చేయిచేసుకున్నాడు. దీంతో ఇలాంటి వాడిని తాను పెళ్లి చేసుకోబోనంటూ పీటలపై నుంచి వధువు లేచివెళ్లిపోయింది. ఆ తర్వాత ఇరు వర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. చివరికి వధువు తరపు వారు చేసిన వివాహ ఖర్చులను తిరిగి చెల్లించేందుకు వరుడి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. ఆ తర్వాత ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు.