Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం పదవిపై కుండబద్దలు కొట్టిన పవన్ కళ్యాణ్ ….

ఇప్పుడు సీఎం పదవిని డిమాండ్ చేసే పరిస్థితిలో లేను: పవన్ కల్యాణ్…

  • మంగళగిరిలో పవన్ ప్రెస్ మీట్
  • అందరినీ కలుపుకుని వెళ్లాలనేది తన మనస్తత్వమని వెల్లడి
  • పొత్తులపై ఒక్కడ్నే నిర్ణయం తీసుకోలేనని స్పష్టీకరణ
  • బీజేపీ కూడా ఆలోచించాల్సి ఉంటుందని వివరణ
  • 30-40 సీట్లు గెల్చి ఉంటే సీఎం పదవి గురించి మాట్లాడేవాళ్లమని వ్యాఖ్యలు

మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ పొత్తులపై మరోసారి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిని కానని పరోక్షంగా వెల్లడించారు. సీఎం కుర్చీని గట్టిగా అడిగి తీసుకోగల బలం ప్రస్తుతానికి జనసేనకు లేదన్నారు. వైసీపీ నుంచి ఏపీని విముక్తం చేయడమే తమ ప్రధాన అజెండా అని ఈ దిశగా కలిసివచ్చే పార్టీలతోనే తమ పొత్తు ఉంటుందని వివరించారు.

తనకు లెఫ్ట్ పార్టీలు, రైట్ పార్టీలు అనే తేడా లేదని, అందరినీ కలుపుకుని వెళ్లాలనేది తన మనస్తత్వం అని స్పష్టం చేశారు. అయితే కమ్యూనిస్టు పార్టీలతో బీజేపీ కలవదని, బీజేపీతో కమ్యూనిస్టు పార్టీలు కలవవని, వారి మధ్య సైద్ధాంతిక వైరుధ్యం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. అందుకే తమది కూటమిలా ఉంటుందే తప్ప, ఇందులో అన్ని పార్టీలు ఉండకపోవచ్చని వివరించారు.

“వచ్చే ఎన్నికల్లో ఓటు చీలనివ్వనని చెప్పాను. ఈ దిశగానే మా పొత్తులు ఉంటాయి. కొన్ని పార్టీలు దశాబ్దాలుగా రాజకీయంగా మనుగడ సాగిస్తున్నాయి… అలాంటి పార్టీలపై మాకు గౌరవం ఉంది. కానీ ఎన్నికల్లో ప్రభావం చూపగలిగే ప్రధాన పార్టీలతోనే మా పొత్తు ఉంటుంది. అన్ని పార్టీలు కలిసొస్తే మంచిదే. పొత్తులపై నేను ఒక్కడ్నే నిర్ణయం తీసుకోలేను. మా భాగస్వామి బీజేపీ కూడా ఉంది కాబట్టి… వారు కూడా ఆ స్థాయిలో పొత్తుల గురించి ఆలోచించాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా పొత్తులతోనే బలపడిందన్న విషయం మరువరాదు. ప్రతి పార్టీకి సొంత ఓటు బ్యాంకు ఉంటుంది.

2014లో లోతైన చర్చలు, అధ్యయనం తర్వాతే బీజేపీ, టీడీపీకి దగ్గరయ్యాం. అప్పటికప్పుడు అభ్యర్థులను దింపలేకపోయాం. అందుకే ఆ ఎన్నికల్లో మేం పోటీ చేయలేకపోయాం. ఇటీవల నేను టీడీపీ నేతలను కలుస్తుంటే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మీరు తగ్గడం ఏంటి… మీరు సీఎం అభ్యర్థి అని అవతలివాళ్లు ఒప్పుకుంటేనే పొత్తు పెట్టుకోండి అని అంటున్నారు.

గత ఎన్నికల సమయంలో 137 స్థానాల్లో పోటీ చేశాం. ఆ సమయంలో గనుక మేం 30-40 స్థానాల్లో గెలిచి ఉంటే ఇవాళ సీఎం అభ్యర్థిగా బరిలో దిగే వీలుండేది. జనసేన ఒంటరిగా పోటీ చేయగలదన్న నమ్మకం ఉండేది. కర్ణాటకలో కుమారస్వామి లాగా చక్రం తిప్పాలంటే చేతిలో 30-40 స్థానాలు ఉండాలి.

మా గౌరవానికి భంగం కలగకుండా ఉంటేనే ఇతర పార్టీలతో పొత్తులు ఉంటాయి. కొందరిని పెద్దన్న పాత్ర వహించమని కోరాను. పెద్దన్న పాత్ర వహించడం అంటే బాధ్యత తీసుకోవడం. మేం ఏదో ఒక కులం కోసం పనిచేయడంలేదు… రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. అందుకే అన్ని కులాల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే పొత్తు అనే పదాన్ని వాడాం. దానికే కట్టుబడి ఉన్నాం.

ఈసారి ముందస్తు ఎన్నికలు వస్తాయంటున్నారు. జూన్ నుంచి మంగళగిరిలోనే ఉండి కార్యకలాపాలు ముమ్మరం చేస్తాం. ఈసారి వైసీపీ దాష్టీకాన్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగా పోరాడతాం. రాయలసీమలో మాకు బలం లేకపోవచ్చు… మాకు పట్టు ఉన్న స్థానాల్లో 30 శాతానికి బలం పెరిగిందని చెప్పగలం.

సినిమాల్లో సూపర్ స్టార్ హోదా నాకు నేనుగా తెచ్చుకుందే. రాజకీయాల్లో కూడా అంతే. నన్ను సీఎంను చేస్తామని బీజేపీ, టీడీపీ ఎందుకు అంటాయి? నేనే గనుక బీజేపీ అధ్యక్షుడ్ని అయినా, నేనే గనుక టీడీపీ అధ్యక్షుడ్ని అయినా వేరొకరిని సీఎంను చేస్తామని నేను అనను. రాజకీయాల్లో నాకు నేనుగా కష్టపడి ఆ స్థాయికి చేరాల్సిందే.

పొత్తు అంటూ ఏర్పడితే అది ఒక్క నిబంధన మీదనే ఉంటుంది. వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడడమే ముఖ్యం” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Related posts

చెప్పేది వినని సభ్యుడికి నేను ఎలా బదులిచ్చేది?: రాహుల్ ప్రశ్నలపై మోదీ స్పందన!

Drukpadam

కాంగ్రెస్ లో లొల్లి… కార్యకర్తల పరేషాన్ …

Drukpadam

చెత్త రాజకీయాల కంటే కొన్ని సార్లు వారసత్వ రాజకీయాలే మేలు: అభిషేక్‌ బెనర్జీ…

Drukpadam

Leave a Comment