రాహుల్ యాత్ర చేసిన 36 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు…!
- కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన భారత్ జోడో యాత్ర
- మొత్తం 7 జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో నడిచిన రాహుల్
- అత్యధికంగా మైసూర్‌లో 8 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కీలక పాత్ర పోషించింది. రాహుల్ పర్యటించిన జిల్లాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 51 నియోజకవర్గాల్లో రాహుల్ యాత్ర చేయగా.. 36 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. చామరాజనగర్ జిల్లా నుంచి కర్ణాటకలోకి ప్రవేశించింది. తర్వాత మైసూరు, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు.
ఈ 7 జిల్లాల్లో మొత్తం 51 నియోజకవర్గాలు ఉన్నాయి. చామరాజనగర్‌లోని 4 నియోజకవర్గాల్లో 3, మైసూర్‌లోని 11 నియోజకవర్గాల్లో 8, మాండ్యలోని 7 నియోజకవర్గాల్లో 5, తుమకూరులోని 11 సీట్లలో 6, చిత్రదుర్గలోని 6 నియోజకవర్గాల్లో 5, బళ్లారిలో 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాయచూర్‌లోని ఏడింటిలో కాంగ్రెస్ 4 గెలుచుకుంది.