అమెరికాలో భర్త అకాలమరణం.. అంబర్ పేటలో భార్య ఆత్మహత్య!
- అమెరికాలో ఉంటున్న హైదరాబాదీ దంపతులు
- తల్లిదండ్రులను చూసేందుకు ఇటీవల పుట్టింటికి వచ్చిన యువతి
- అమెరికాలో ఉంటున్న భర్తకు గుండెపోటు, హఠాన్మరణం
- భర్త మృతి తట్టుకోలేక నిరాశలో యువతి
- ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్య
పెళ్లయిన ఏడాదికే భర్త గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడాన్ని ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. తీవ్ర మనోవేదనలో కూరుకుపోయిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ అంబర్ పేటలోని డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి వనస్థలిపురానికి చెందిన టెకీ మనోజ్‌తో ఏడాది క్రితం పెళ్లి జరిగింది. వివాహం తరువాత ఆ జంట అమెరికా వెళ్లిపోయింది. వారు డల్లాస్‌లో ఉంటున్నారు. ఈ నెల 2న తల్లిదండ్రులను చూసేందుకని సాహితి హైదరాబాద్‌కు వచ్చింది. అయితే, అమెరికాలోనే ఉండిపోయిన ఆమె భర్త మనోజ్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు.
భర్త మరణవార్త తెలిసిన నాటి నుంచీ సాహితి తీవ్ర వేదనలో కూరుకుపోయింది. ఈ నెల 23న మనోజ్ మృతదేహాన్ని నగరానికి తీసుకురాగా, విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి ఆమె తట్టుకోలేకపోయింది. బుధవారం భర్త అంత్యక్రియల అనంతరం సాహితి అంబర్‌పేటలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత నుంచీ ముభావంగా ఉండటం ప్రారంభించింది. ఆమెకు తోడుగా ఉంటున్న చెల్లెలు గురువారం ఉదయం పనిమీద బయటకు వెళ్లగా సాహితి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో చెల్లెలు బయటకు వెళ్లి వచ్చే సరికి సాహితి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.